శుక్రవారం గాంధీభవన్‌లో సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అధ్యక్షతన కాంగ్రెస్ నేతలు సమావేశమయ్యారు. ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, గండ్ర వెంకటరమణా రెడ్డి, సీతక్క ఎమ్మెల్సీలు షబ్బీర్ అలీ, జీవన్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్-ఛార్జ్ కుంతియా, సీనియర్ నేత గీతారెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్సీగా ఎన్నికైన జీవన్‌రెడ్డికి శాలువా కప్పి సన్మానించారు. ఆయన విజయం రాష్ట్రంలో తెరాస పతనానికి నాంది కాబోతోందని మల్లు భట్టివిక్రమార్క అన్నారు. గత 15 రోజులలో వరుసగా పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలోకి వెళ్లిపోవడంపై వారు చర్చించారు. 10 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినప్పటికీ లోక్‌సభ ఎన్నికలలో అత్యధిక స్థానాలు గెలుచుకొని మళ్ళీ పార్టీని బలోపేతం చేసుకొంటామని మల్లు భట్టివిక్రమార్క చెప్పారు.
16 ఎంపీ సీట్లతో డిల్లీలో చక్రం తిప్పుతానని గొప్పలు చెప్పుకొంటున్న కేసీఆర్‌ను రాష్ట్రం దాటితే ఎవరూ గుర్తించేవారే లేరని మల్లు భట్టివిక్రమార్క ఎద్దేవా చేశారు.
బిజెపికి బీ టీంగా పనిచేస్తున్న తెరాసతో మజ్లీస్ ఏ ప్రాతిపదికన స్నేహం చేస్తోందో చెప్పాలని అన్నారు. మళ్ళీ మోడీని ప్రధానమంత్రిని చేయడానికే కేసీఆర్ 16ఎంపీ సీట్లు అడుగుతున్నారని తెలిసి మజ్లీస్ పార్టీ తెరాసతో దోస్తీ చేయడం ప్రజలను మోసం చేయడమేనని మల్లు భట్టివిక్రమార్క ఆరోపించారు.