కేసీఆర్‌కు ప్రధాని మోడీ చురకలు

March 29, 2019


img

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం మహబూబ్‌నగర్‌లో జరిగిన బిజెపి బహిరంగసభలో ప్రధాని నరేంద్రమోడీ తెలంగాణ సిఎం కేసీఆర్‌కు చాలా చురకలు వేశారు. తెలంగాణ రాష్ట్రాన్ని కేసీఆర్‌ నడిపిస్తున్నారో లేక వాస్తుసిద్దాంతులు, జ్యోతిష్యులు నడిపిస్తున్నారో తెలియదని అన్నారు. పార్లమెంటు ఎన్నికలతో పాటు శాసనసభ ఎన్నికలకు వెళ్ళినట్లయితే ఓడిపోతావని ఎవరో జ్యోతిష్యుడు చెపితే, కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లారని ప్రధాని నరేంద్రమోడీ ఎద్దేవా చేశారు. మోడీ చరిష్మాను తట్టుకొని నిలబడలేక తెరాస తుడిచిపెట్టుకుపోతుందనే భయంతోనే జ్యోతిష్యుడి మాట ప్రకారం ముందస్తు ఎన్నికలకు వెళ్ళి వందలకోట్ల ప్రజాధనం వృధా చేశారని మోడీ విమర్శించారు. కేసీఆర్‌ ఎప్పుడూ తన కుటుంబం కోసమే ఆలోచిస్తుంటారని, దేశం రాష్ట్రం కోసం ఆలోచించలేరని ప్రధాని నరేంద్రమోడీ విమర్శించారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్‌కే మళ్ళీ అధికారం కట్టబెట్టినా ఆయన రాష్ట్ర ప్రజలను,ప్రభుత్వాన్ని గాలికొదిలేసి ఫెడరల్‌ ఫ్రంట్‌ అంటూ తిరిగారని, మంత్రివర్గం ఏర్పాటు చేయడానికి 3 నెలలు ఎందుకు పట్టిందని ప్రధాని నరేంద్రమోడీ ప్రశ్నించారు. 

గత 5 ఏళ్ళలో నా పరిపాలన ఏవిధంగా ఉందో అందరూ చూశారు. ఒకప్పుడు దేశంలో తరచూ బాంబులు పేలుతూ ప్రజలు మరణిస్తుండేవారు కానీ గత 5 ఏళ్ళలో దేశంలో అటువంటి ఒక్క సంఘటన జరుగకుండా సమర్ధంగా పనిచేస్తున్న ప్రభుత్వం తనదని నరేంద్రమోడీ అన్నారు. ఈ లోక్‌సభ ఎన్నికలు కేవలం ప్రధానమంత్రిని ఎన్నుకోవడం కోసం మాత్రమే జరుగుతున్నవి కాదు...ఈ దేశ ఉజ్వల భవిష్యత్ కోసం జరుగుతున్న ఎన్నికలని ప్రజలందరూ గుర్తుంచుకోవాలని కోరారు. కేంద్రంలో బలమైన, నీతివంతమైన, పారదర్శకమైన ప్రభుత్వం ఏర్పడాలంటే ప్రజలందరూ బిజెపికే ఓట్లు వేసి గెలిపించాలని ప్రధాని నరేంద్రమోడీ కోరారు. 


Related Post