నన్ను ఓడించి ప్రజలు తప్పు చేశారు: తుమ్మల

March 29, 2019


img

ఎన్నికలలో ఓడిపోయినవారు ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తున్నామనో లేదా అధికార పార్టీ కుట్రలు కుతంత్రాల వలన ఓడిపోయామనో చెప్పుకొంటారు కానీ ప్రజల నిర్ణయాన్ని తప్పు పట్టే సాహసం చేయరు. ఒకవేళ ప్రజాభిప్రాయం తప్పని చెప్పాలనుకొన్నా  ‘ప్రజలు తమ ప్రత్యర్ధుల మాయమాటలు నమ్మి మోసపోయారని’ సున్నితంగా చెపుతారే తప్ప తుమ్మల నాగేశ్వరరావు మాదిరిగా ‘నన్ను ఓడించి పాలేరు ప్రజలు చాలా తప్పు చేశారు. అందుకు వారు కుమిలిపోతున్నారని’ అనరు. 

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కూసుమంచిలో తెరాస అభ్యర్ధి...తన చిరకాల రాజకీయ ప్రత్యర్ధి నామా నాగేశ్వరరావుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నప్పుడు, ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలలో రాష్ట్రంలో ప్రజలందరూ తెరాసకు ఓటేస్తే ఒక్క ఖమ్మం జిల్లా ప్రజలు మాత్రం కాంగ్రెస్‌ పార్టీకి ఓటేశారు. కాంగ్రెస్ పార్టీకి వేసిన వారి ఓట్లన్నీ మురిగిపోయి మురికి కాలువలో కలిసిపోయాయి. అందుకు ప్రజలందరూ చాలా బాధపడ్డారు. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో మళ్ళీ అటువంటి తప్పు చేయరని ఆశిస్తున్నాను. చేస్తే ఈసారి కుక్కలు కూడా మిమ్మల్ని చూడవు. నేను ఖమ్మం జిల్లా అభివృద్ధికి ఎంతగానో కృషి చేశాను. మళ్ళీ గెలిస్తే పాలేరు నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేద్దామనుకొన్నాను. కానీ పాలేరు ప్రజలు నన్ను ఓడించి పొరపాటు చేశారు. అందుకు వారు కూడా ఇప్పుడు బాధపడుతున్నారు. కనుక నేను మద్దతు ఇస్తున్న మా తెరాస అభ్యర్ధి నామా నాగేశ్వరరావును గెలిపించి మీరు చేసిన ఆ పొరపాటు సరిదిద్దుకోవాలని ప్రజలను కోరుతున్నాను. నామాను గెలిపిస్తే నన్ను గెలిపించినట్లే భావిస్తాను,” అని తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. 

తుమ్మల ఓడిపోవడం చాలా ఆశ్చర్యమే. పార్టీలో కొందరు వ్యక్తులే తన ఓటమికి కారకులని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. కానీ ఇప్పుడు తనను ఓడించి ప్రజలు తప్పు చేశారని నిందిస్తున్నారు. ప్రజలను నిందించే హక్కు ఆయనకు లేదు ఎందుకంటే తమకు నచ్చిన అభ్యర్ధిని ఎన్నుకొనే హక్కు ప్రజలకుంది. 

ఈరోజుల్లో ఎన్నికలంటే, ప్రజలు పోలింగు బూతులకు వెళ్ళి ఓట్లేసి రావడం మాత్రమే కాదని అందరికీ తెలుసు. ఒక అభ్యర్ధి జయాపజయలకు అనేక కారణాలు ఉంటాయి. వాటిలో ప్రజాభిప్రాయం ఒకటి. అయినా ప్రజలెన్నుకొన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు వారి అభిప్రాయాన్ని గౌరవించకుండా ఇష్టం వచ్చినట్లు పార్టీలు మారుతున్నప్పుడు, ప్రజలు మాత్రం తుమ్మల వంటి నేతలమాటను ఎందుకు మన్నించాలి? అయినా తుమ్మల కారు గుర్తుకు ఓటేయమని కోరుతుంటే, ఆ గుర్తుపై పోటీ చేస్తున్న నామా నాగేశ్వరరావు సైకిలు గుర్తుకు ఓటేయమని కోరుతున్నారు కదా?  

ఇంతకాలం టిడిపిలో ఉండి ఇప్పుడు టికెట్ కోసం తెరాసలో చేరిన నామా నాగేశ్వరరావుకు ఓటేస్తే ఆయన అదే పార్టీలో ఉంటారనే నమ్మకం ఏమిటి? అసలు నామాకు బదులు తుమ్మలకే ఖమ్మం లోక్‌సభ టికెట్ కేటాయించి ఉండిఉంటే జిల్లా ప్రజలు తప్పు చేశారో లేదో నిరూపించి చూపేవారు కదా?


Related Post