రైతులతో సిఎం మాట్లాడటం ఉల్లంఘనే..కాంగ్రెస్‌ ఫిర్యాదు

March 29, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గురువారం రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి రజత్ కుమార్‌ను కలిసి సిఎం కేసీఆర్‌పై ఫిర్యాదు చేశారు. 

మూడు రోజుల క్రితం మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన శరత్ అనే యువరైతు తన భూమి సమస్యను పరిష్కరించమని కోరుతూ సిఎం కేసీఆర్‌కు ఫేస్ బుక్ ద్వారా విజ్ఞప్తి చేశాడు. దానిపై వెంటనే స్పందించిన సిఎం కేసీఆర్‌ నేరుగా అతనితో ఫోన్లో మాట్లాడి, వెంటనే జిల్లా కలెక్టరుతో సహా రెవెన్యూ అధికారులను ఆ గ్రామానికి పంపించి అతని సమస్యను పరిష్కరింపజేశారు. 

ఈవిషయం తెలుసుకొన్న సిద్ధిపేటలోని దుబ్బాకకు చెందిన వెంకటాచారి అనే మరో యువరైతు కూడా ఫేస్ బుక్ ద్వారా సిఎం కేసీఆర్‌ సహాయం కోరగా అతని సమస్యను కూడా పరిష్కరించారు. ఫేస్‌బుక్‌లో సమస్యలపై సిఎం కేసీఆర్‌ వెంటనే స్పందిస్తున్నారనే వార్త కార్చిచ్చులా వ్యాపించడంతో వందలాది మంది రైతులు తమ భూసమస్యలను పరిష్కరించాలని సిఎం కేసీఆర్‌ను కోరుతూ ఫేస్‌బుక్‌లో మెసేజిలు పోస్టు చేస్తున్నారు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు సిఎం కేసీఆర్‌ ఈవిధంగా నేరుగా రైతులతో మాట్లాడుతూ, చిరకాలంగా పెండింగులో ఉన్న వారి భూసమస్యలను రాత్రికి రాత్రి పరిష్కరిస్తూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారని, ఇది ఎన్నికల నియామావళి ఉల్లంఘనేనని కాంగ్రెస్‌ నేతలు ఎన్నికల సంఘం ప్రధానాధికారికి ఫిర్యాదు చేశారు. సిఎం కేసీఆర్‌ స్వయంగా ఎన్నికల నియామవళిని ఉల్లంఘించడమే కాకుండా అధికారులను కూడా నియామవళికి విరుద్దం వ్యవహరించేలా చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. కనుక సిఎం కేసీఆర్‌, సంబందిత అధికారులపై తగిన చర్యలు తీసుకోవలసిందిగా కాంగ్రెస్‌ నేతలు రజత్ కుమార్‌ను కోరారు. 

అనంతరం మర్రి శశిధర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “ఊహించని ప్రకృతి విపత్తులు, ప్రమాదాలు జరిగినప్పుడు ముఖ్యమంత్రి తప్పకుండా స్పందించాలి. దానికి ఎవరూ అభ్యంతరం చెప్పబోరు. కానీ చిరకాలంగా పెండింగులో ఉన్న భూసమస్యలు ఇప్పుడే దృష్టికి వచ్చినట్లు ఆయన రైతులతో ఎందుకు మాట్లాడుతున్నారు? ఆవిధంగా చేయడం ఎన్నికల నియామవళికి విరుద్దమని తెలిసి ఉన్నప్పటికీ అధికారులను ఎందుకు పరుగులు పెట్టిస్తున్నారు? సరిగ్గా ఎన్నికలకు ముందే రైతులు ఫేస్‌బుక్‌లో ముఖ్యమంత్రికి మెసేజులు పెట్టడం ఏమిటి? వాటిపై ఆయన స్పందించడం ఏమిటి? ఇదంతా ఓటర్లను ప్రభావితం చేసి లోక్‌సభ ఎన్నికలలో తెరాసకు లబ్ధి చేకూర్చడం కోసమే తెరాస ఆడుతున్న కొత్త నాటకమని మేము భావిస్తున్నాము. దీనిపై చర్యలు తీసుకోవాలని రజత్ కుమార్‌ను కోరాము,” అని అన్నారు. 


Related Post