రాజకీయ సన్యాసం చేస్తా: ఉత్తమ్

March 29, 2019


img

తెలంగాణ పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మళ్ళీ మరోసారి ‘రాజకీయ సన్యాసం’ సవాలు చేశారు. నల్గొండలో దేవరకొండ మండలంలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “తండ్రీ కొడుకులు (కేసీఆర్‌, కేటీఆర్‌) ఇద్దరూ ప్రాజెక్టులు కట్టిస్తున్నామని, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు నిర్మిస్తున్నామని, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తామని మాయమాటలు చెపుతూ కాలక్షేపం చేస్తున్నారు తప్ప 5 ఏళ్ళలో ఏ ఒక్క హామీని కూడా అమలుచేయలేదు. మళ్ళీ ఇప్పుడు 16 ఎంపీ సీట్లు ఇస్తే డిల్లీలో చక్రం తిప్పుతామని, రాష్ట్రానికి అన్నీ సాధించుకొస్తామని నమ్మబలుకుతున్నారు. తెరాసకు 16 ఎంపీ సీట్లు వస్తాయంటూ జోరుగా ప్రచారం చేసుకొంటున్నారు. వారికి 16 ఎంపీ సీట్లు వచ్చినట్లయితే నేను రాజకీయ సన్యాసం చేస్తాను. ఈసారి రాష్ట్రంలో, జాతీయస్థాయిలో కాంగ్రెస్ పార్టీ అత్యధిక ఎంపీ సీట్లు గెలుచుకొని, కేంద్రంలో అధికారంలోకి రాబోతోంది. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావడం తధ్యం,” అని అన్నారు.  

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేవరకు గడ్డం గీసుకొనని సుమారు రెండేళ్ళ క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈవిధంగానే శపధం చేశారు. ఆ తరువాత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని, గాంధీభవన్‌లో మళ్ళీ అడుగుపెట్టనని శపధం చేశారు. ఈ మూడు శపధాలలో ‘గడ్డం శపధం’ వల్ల పెద్దగా ఇబ్బంది లేదు కనుక దానిని పాటిస్తూ మిగిలిన రెండు శపధాలను పక్కనపెట్టారు. మళ్ళీ ఇప్పుడు రాజకీయ సన్యాసం చేస్తానంటూ శపధం చేస్తున్నారు. 

దానికి రెండు కారణాలు కనిపిస్తున్నాయి. 1. రాష్ట్రంలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్‌, బిజెపిలు కూడా కొన్ని ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయం కనుక తెరాసకు 16 సీట్లు రావు కనుక రాజకీయ సన్యాసం చేయవలసిన అవసరం ఉండదనే నమ్మకం. 

2. ఫిరాయింపుల కారణంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నానాటికీ దయనీయంగా మారుతోంది. పార్టీలో చాలా మంది ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వాన్ని పదేపదే ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఈ ఎన్నికలలో ఓడిపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దిగజారుతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓడిపోతే పార్టీలో ఆయన పరిస్థితి దిగజారుతుంది. కనుక కాంగ్రెస్‌ అధిష్టానం ఆయనను మార్చే ప్రయత్నం చేయవచ్చు. రాష్ట్రంలో పార్టీ మనుగడ ప్రశ్నార్ధకంగా మారుతున్న సమయంలో రాజకీయ సన్యాసమే ఉత్తమపరిష్కారం. దాంతో పార్టీ సమస్యలు తీరకపోయినా ఈ రాజకీయ రొంపి నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి బయటపడి ప్రశాంతంగా బ్రతకవచ్చు. 


Related Post