తెరాసకు జితేందర్‌రెడ్డి నుంచే సవాలు?

March 28, 2019


img

మహబూబ్‌నగర్‌ తెరాస సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డి బిజెపిలో చేరిపోయారు. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆయన బుదవారం బిజెపిలో చేరిపోయారు. సిఎం కేసీఆర్‌ ఆయనకు టికెట్ నిరాకరించడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న జితేందర్‌రెడ్డిని బిజెపి జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్ హైదరాబాద్‌లో కలిసి మాట్లాడి పార్టీలో చేరేందుకు ఒప్పించారు. జితేందర్‌రెడ్డి మొదట బిజెపిలోనే ఉండేవారు. 1999లో ఆయన బిజెపి తరపున మహబూబ్‌నగర్‌ నుంచి లోక్‌సభకు పోటీచేసి గెలిచారు. కనుక రాష్ట్ర, జాతీయ స్థాయిలో బిజెపి నేతలందరితో ఆయనకు మంచి స్నేహసంబంధాలున్నాయి కనుక బిజెపిలో సులువుగానే ఇమిడిపోగలరు. ఆయనకు రాజ్యసభ సీటు ఇస్తామని బిజెపి హామీ ఇచ్చినట్లు సమాచారం. అలాగే బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా అడిగినట్లు సమాచారం. ఒకవేళ ఆయనకు ఆ పదవి లభిస్తే రాష్ట్రంలో బిజెపి మళ్ళీ బలపడే అవకాశం ఉంది. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు జితేందర్‌రెడ్డి బిజెపిలో చేరడం మహబూబ్‌నగర్‌ నుంచి బిజెపి అభ్యర్ధిగా పోటీ చేస్తున్న డికె అరుణకు కలిసివస్తుందని చెప్పవచ్చు. ఆమెను గెలిపించుకోగలిగితే బిజెపికి తన సత్తాను చాటిచెప్పినట్లవుతుంది. టికెట్ ఇవ్వకుండా తనను అవమానించినందుకు తెరాసపై ప్రతీకారం తీర్చుకొన్నట్లవుతుంది కనుక ఆయన డికె అరుణను గెలిపించేందుకు సర్వశక్తులు ఒడ్డవచ్చు. కనుక ఆయన స్థానంలో మహబూబ్‌నగర్‌ నుంచి పోటీ చేస్తున్న తెరాస అభ్యర్ధి మన్నే శ్రీనివాస్ రెడ్డికి లోక్‌సభ ఎన్నికలలో ఎదురీత తప్పకపోవచ్చు.      



Related Post