అధికారం కోసం పధకాలు ప్రకటిస్తే...

March 28, 2019


img

ప్రధాని నరేంద్రమోడీ 5 ఏకరాలలోపు భూమి ఉన్న రైతులకు ఏడాదికి రూ.6,000 ఇస్తామని ప్రకటిస్తే, కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే దేశంలో 5 కోట్ల కుటుంబాలకు నెలకు రూ.6,000 చొప్పున వారి బ్యాంక్ ఖాతాలలో జమా చేస్తామని రాహుల్ గాంధీ ప్రకటించారు. ఎన్నికలలో గెలిచి అధికారం చేజిక్కించుకొనేందుకు ఇటువంటి తాయిలాలు పంచుకొంటూపోతే దేశ ఆర్ధికవ్యవస్థ కుప్పకూలే ప్రమాదం ఉందని ఆర్ధికనిపుణులు హెచ్చరిస్తున్నారు. 

ప్రస్తుతం కేంద్రప్రభుత్వం దేశంలో అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పధకాలకు కలిపి ఏడాదికి రూ.5,40,000 కోట్లు ఖర్చు చేస్తోంది. రాహుల్ గాంధీ ప్రకటించిన ఈ కనీస ఆదాయ పధకం అమలుచేయాలంటే ఒక్కో కుటుంబానికి ఏడాదికి రూ.72,000 చొప్పున 5 కోట్లమందికి ఏడాదికి రూ.3,60,000 కోట్ల రూపాయలు అవసరం ఉంటుంది. అంటే రెండూ కలిపితే మొత్తం 9,00,000 కోట్లు బడ్జెట్‌లో కేటాయించవలసి ఉంటుందన్నమాట! మరి ఒకేసారి ఇంతసొమ్ము రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి తీసుకువస్తారు?

135 కోట్లు జనాభా ఉన్న భారతదేశంలో కేవలం 5 కోట్లుమంది మాత్రమే దారిద్యరేఖకు దిగువన ఉన్నారని ఏవిధంగా గుర్తించారు? ఒకవేళ వీరి సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నా లేదా ఇంకా పెరిగినప్పుడు వారికి ఈ పధకాన్ని వర్తింపజేసేందుకు ఇంకా ఎంత సొమ్ము అవసరం? దానిని ఏవిధంగా సమకూర్చుకొంటారు? అనేవి ఆర్ధికరంగ నిపుణులడుగుతున్న ప్రశ్నలు. 

ఈ పధకానికి రాజకీయపరంగా కూడా కొన్ని ప్రశ్నలకు రాహుల్ గాంధీ సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ సొంతంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే సంగతి రాహుల్ గాంధీకి కూడా తెలుసు. ఇతర పార్టీల మద్దతుతో ప్రభుత్వం ఏర్పాటుచేయవలసిన స్థితిలో ఉన్నప్పుడు రాహుల్ గాంధీ ఏవిధంగా ఇటువంటి పెద్ద నిర్ణయం తీసుకొన్నారు? దీనిని మిత్రపక్షాలు అంగీకరిస్తాయా? పైగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తాయని భావిస్తున్న పార్టీలలో మాయావతి, మమతా బెనర్జీ, దేవగౌడ వంటివారు ప్రధానమంత్రి పదవిని ఆశిస్తున్నప్పుడు, ఈపధకాన్ని అమలుచేస్తామని రాహుల్ గాంధీ ఏవిధంగా ప్రజలకు హామీ ఇస్తున్నారు? అనే ప్రశ్నలకు రాహుల్ గాంధీ సంతృప్తికరమైన సమాధానాలు చెప్పాలి.

‘మేము దీనిపై ఆరు నెలలు అధ్యయనం చేశాం...నిపుణులను సంప్రదించాం..లెక్కలు కట్టుకొన్నాం..తప్పకుండా అమలుచేస్తాం...’అనేవి మాత్రం ఈ ప్రశ్నలకు సమాధానం కావు.

సంపద సృష్టించి దాని ఫలాలను అందరికీ అందజేయాలి తప్ప దేశప్రజలపై పన్నులభారం పెంచి దానిని ఈవిధంగా పంచిపెట్టాలనుకోవడం అవివేకమే.


Related Post