హరీష్‌ చెప్పింది నిజమే కదా?

March 28, 2019


img

మాజీ మంత్రి, తెరాస ఎమ్మెల్యే హరీష్‌రావు బుదవారం సిద్ధిపేటలో ఎన్నికల ప్రచారంలో ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కాంగ్రెస్‌, బిజెపి నేతలు ఎన్నికలొచ్చినప్పుడే ప్రజలకు కనిపిస్తుంటారు. లేకుంటే ఎవరికీ కనబడరు... ప్రజలకు అందుబాటులో ఉండరు. కానీ తెరాస ప్రజాప్రతినిధులు ఎల్లపుడూ ప్రజల మద్యనే ఉంటూ మీ సమస్యల పరిష్కారానికి, నియోజకవర్గాల అభివృద్ధికి కృషి చేస్తుంటారు. మాకు ఒక్కసారి ఓటేస్తే ఐదేళ్ళు మీకు సేవ చేస్తాము. కనుక మీకు ఎటువంటి ఎంపీలు కావాలో మీరే నిర్ణయించుకోండి. 

కేంద్రంలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒకే ఒక కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ. ఉన్న ఆ ఒక్కరినీ కూడా ఎటువంటి కారణం చూపకుండా నరేంద్రమోడీ పక్కనపెట్టేశారు. బిజెపి సొంత నేతలనే పట్టించుకోని కేంద్రప్రభుత్వం, రాష్ట్రాన్ని పట్టించుకొంటుందా? కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వమని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదు. రాష్ట్రానికి నిధులు ఇవ్వమని అడిగితే పట్టించుకోలేదు. మరి మనం బిజెపికి ఎందుకు ఓటేయాలి? బిజెపికి ఓటేస్తే నరేంద్రమోడీ ప్రధాని అవుతారు. కాంగ్రెస్ పార్టీకి వేస్తే రాహుల్ గాంధీ ప్రధాని అవుతారు. అదే..తెరాసకు వేస్తే తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు మేలు కలుగుతుంది. కనుక తెరాసను గెలిపించవలసిందిగా కోరుతున్నాను,” అని అన్నారు.   

కాంగ్రెస్‌, బిజెపి ఎంపీల గురించి హరీష్‌రావు అన్న మాటలు సహేతుకమైనవేనని అందరికీ తెలుసు. ఆ రెండు పార్టీలలో ఎన్నికలలో గెలిచినవారిలో దత్తన్న వంటి అతికొద్దిమంది తప్ప మిగిలినవారెవరూ సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండరనే సంగతి అందరికీ తెలిసిందే. అప్పుడు ప్రజలు తమ గోడు ఎవరికి చెప్పుకోవాలో తెలియక బాధలు పడుతుంటారు. అదే తెరాసలో ప్రజాప్రతినిధులు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఒకవేళ వారు ప్రజల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలిస్తే అటువంటివారిని మందలించి మళ్ళీ గాడిన పెడుతుంటారు. అప్పటికీ తీరు మార్చుకోకపోతే ఎంత పెద్ద మంత్రులైనా, ఎంపీలైనా, ఎమ్మెల్యేలైనా నిర్ధాక్షిణ్యంగా పక్కనపెడుతుండటం అందరూ చూస్తూనే ఉన్నారు. ప్రజాప్రతినిధులు అందరూ తప్పనిసరిగా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నడుచుకోవలసిందేనని ఖరాకండీగా చెపుతుంటారు. మంత్రులకైనా, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకైనా అటువంటి భయం ఉంటేనే ప్రజలకు ఉపయోగపడతారు. ఆ భయం ఉంది కాబట్టే తెరాస ప్రజాప్రతినిధులు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటారు. అదే హరీష్‌రావు చెప్పారు.


Related Post