నిజామాబాద్‌ బరిలో ఎంతమంది మిగులుతారో?

March 28, 2019


img

నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలతో పూర్తవుతుంది. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు మొత్తం 795 మంది నామినేషన్లు వేశారు. రాష్ట్రంలో అత్యధికంగా నిజామాబాద్‌లో 245 మంది నామినేషన్లు వేశారు. వారిలో అత్యధికులు పసుపు, ఎర్రజొన్న పండించే రైతులే. తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించమని కోరుతూ ఎన్నిసార్లు ధర్నాలు చేసినప్పటికీ సిట్టింగ్ ఎంపీ కవిత, రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకొనందుకు నిరసనగా రైతన్నలు ఈవిధంగా తమ ఆగ్రహాన్ని తెలియజేశారు. వారందరినీ ఏదో విధంగా నచ్చజెప్పి వారిచేత నామినేషన్లు ఉపసంహరింపజేయవచ్చునని తెరాస నేతలు భావించారు. కానీ గ్రామసభల అనుమతి లేకుండా ఎవరైనా రైతులు తమ నామినేషన్లు ఉపసంహరించుకొన్నట్లయితే వారిపై లక్ష రూపాయలు జరిమానా విధించాలని, సొమ్ము చెల్లించని వారిని గ్రామబహిష్కరణ చేయాలని రైతులు తీర్మానించుకొన్నారు. ఈ నామినేషన్ల వ్యవహారాన్ని రైతులు ఎంత సీరియస్ గా తీసుకొన్నారో దీనిని బట్టి అర్ధం అవుతోంది. కనుక ఈరోజు నామినేషన్లు గడువు ముగిసేలోగా రైతులను ఒప్పించడం సాధ్యం కాకపోవచ్చు. అదేజరిగితే నిజామాబాద్‌లో బ్యాలెట్ పేపర్లద్వారా ఎన్నికలు నిర్వహించవలసి ఉంటుంది. సికిందరాబాద్‌లో 67, నల్గొండ: 48, భువనగిరి: 45, ఖమ్మం: 38, పెద్దపల్లి: 35, మహబూబ్‌నగర్‌: 34 నామినేషన్లు దాఖలయ్యాయి. కనుక మధ్యాహ్నం 3 గంటల తరువాత వీరిలో ఎంతమంది బరిలో మిగులుతారనే విషయంపై స్పష్టత వస్తుంది. 



Related Post