ఖమ్మంలో ఎవరు గెలుస్తారు? రేణుకా...నామా?

March 27, 2019


img

ఎన్నికలెప్పుడు జరిగిన కొన్ని నియోజకవర్గాలలో పోటీ ఆసక్తికరంగానే సాగుతుంటాయి. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ ప్రముఖులు పోటీ చేసిన కొడంగల్, జగిత్యాల్, నల్గొండ, హుజూర్ నగర్, గద్వాల్ వంటి నియోజకవర్గాలలో పోటీ రసవత్తరంగా సాగింది. ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కూడా భువనగిరి, చేవెళ్ళ, మల్కాజ్‌గిరి, సికిందరాబాద్‌, కరీంనగర్‌, ఖమ్మం నియోజకవర్గాలలో కాంగ్రెస్‌-తెరాసల మద్య గట్టి పోటీ నెలకొంది.

ఖమ్మం నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్ధి రేణుకా చౌదరి, తెరాస అభ్యర్ధి నామా నాగేశ్వరరావు ఇద్దరూ అన్ని విధాలా సమ ఉజ్జీలే కావడంతో వారిరువురిలో ఎవరు గెలుస్తారనే ఆసక్తి నెలకొని ఉంది.

నామా నాగేశ్వరరావు:

బలాలు: నామా ఇటీవలే టిడిపి నుంచి తెరాసలో చేరి టికెట్ సంపాదించుకొన్నారు. కనుక టిడిపిలో తన అనుచరులతో పాటు తెరాస నేతలు, కార్యకర్తలు కూడా ఆయనకు తోడయ్యారు. పైగా అధికార పార్టీ అందదండలు పుష్కలంగా లభిస్తాయి. ఇటువంటి ఎన్నికలను ఎదుర్కోవడంలో ఆయనకు మంచి నేర్పు, అనుభవం రెండూ ఉన్నాయి. కేసీఆర్‌ వ్యూహాలు మరింత ఉపయోగపడతాయి. కేసీఆర్‌ ఆదేశాల మేరకు తుమ్మల నాగేశ్వర రావు, పువ్వాడ అజయ్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు నామాకు అన్ని విధాలా సహకరిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో తెరాస (కేసీఆర్‌) హవా ఉంది కనుక నామాకు విజయావకాశాలు బాగానే ఉన్నాయని చెప్పవచ్చు.   

బలహీనతలు: ఇప్పటి వరకు టిడిపిలో ఉన్నప్పుడు ఆయన ఏ తెరాస నేతలు, కార్యకర్తలతో పోరాటాలు చేస్తుండేవారో ఇప్పుడు వారితోనే కలిసి పనిచేస్తూ, వారిని సమన్వయపరుచుకొంటూ, వారి సహకారం పొందడం కొంచెం కష్టమే. ఖమ్మం టికెట్ ఆశించి భంగపడిన పొంగులేటి ఆయనకు సహకరించకపోగా ఓడించే ప్రయత్నాలు చేయవచ్చు.

రేణుకా చౌదరి:

బలాలు: అన్ని విధాలా నామాకు సరితూగే నేత. తెరాస వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచించి అమలుచేయగల నేర్పు ఆమెకు సొంతం. ఖమ్మం జిల్లా రాజకీయాలపై, కులసమీకరణాలపై ఆమెకు మంచి పట్టుంది. ముఖ్యంగా సామాన్య ప్రజలతో సులువుగా కలిసిపోయే గుణం, సమస్యలపై ధైర్యంగా పోరాడే గుణం కారణంగా ప్రజలలో ఆమెకు మంచి ఆదరణ ఉంది. కాంగ్రెస్‌ అధిష్టానంతో మంచి పరిచయాలు, సన్నిహిత సంబందాలు కలిగి ఉన్నందున ఖమ్మంలో ఆమె, జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ గెలిస్తే ఆమెకు కేంద్రమంత్రి అయ్యే అవకాశం ఉందనే ఊహాగానాలు ప్రజలను ఆమెవైపు మొగ్గేలా చేయవచ్చు. జిల్లాలో పటిష్టమైన క్యాడర్ కలిగి ఉండటం, టిడిపి కూడా మద్దతు ప్రకటించి సహకరిస్తుండటం సానుకూల అంశాలు.

బలహీనతలు: ఫిరాయింపుల కారణంగా డీలాపడిన కాంగ్రెస్‌ శ్రేణులకు మళ్ళీ నమ్మకం, ఆత్మవిశ్వాసం కల్పించి ఈ యుద్ధానికి సిద్దం చేసుకోవలసి రావడం ఇబ్బందికరమే. ఒకవేళ జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ విజయావకాశాలు పెరిగితే ఖమ్మంలో కూడా పెరుగుతాయి లేకుంటే తగ్గిపోవచ్చు.


Related Post