రైతు కష్టం తీర్చిన సిఎం కేసీఆర్‌

March 27, 2019


img

మంచిర్యాల జిల్లాలోని నెన్నెల మండలంలోని నందులపల్లి గ్రామానికి చెందిన శరత్ అనే ఒక యువరైతు 7 ఎకరాల భూమిని స్థానిక వీఆర్వో కరుణాకర్ ఇతరులకు ధారాధత్తం చేయడంతో ఆ రైతన్న గత 11 నెలలుగా అధికారుల చుట్టూ ప్రధాక్షిణాలు చేస్తున్నాడు. కానీ ఎవరూ అతని గోడు వినిపించుకోకపోవడంతో అతను తన సమస్యను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసాడు. అది సిఎం కేసీఆర్‌ దృష్టిలో పడటంతో ఆయన చలించిపోయి వెంటనే శరత్‌కు ఫోన్ చేసి మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకొన్నారు. అతనికి జరిగిన అన్యాయాన్ని సరిచేస్తానని హామీ ఇచ్చారు.

ఆ రైతు సమస్యను వెంటనే పరిష్కరించి, అతనికి రైతుబందు పధకాన్ని కూడా వర్తింపజేయాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆమె వెంటనే బెల్లంపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకొని శరత్‌ భూమి తాలూకు రికార్డులన్నీ బయటకు తీయించి చూడగా అతను చెప్పింది నిజమేనని తేలింది. వారసత్వంగా వస్తున్న ఆ భూమిలో అతను అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేసుకొంటున్నట్లు స్పష్టం అయ్యింది. వెంటనే కలెక్టర్ భారతి, సబ్ కలెక్టర్, అధికారులు  శరత్‌ ఇంటికి వెళ్ళి త్వరలో అతని భూమి తాలూకు రికార్డులన్నీ సరిచేయించి అతనికి అప్పగిస్తామని  హామీ ఇచ్చారు. 

ఆ ప్రాంతంలో ఇంకా ఎవరైనా రైతులు ఇటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నట్లయితే, నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదు చేయాలని కోరారు. భూమికి సంబందించిన సమస్యలను పరిష్కరిస్తామనిహామీ ఇచ్చారు. ముఖ్యమంత్రి స్వయంగా స్పందించి తన సమస్యను పరిష్కరించినందుకు శరత్ కృతజ్ఞతలు తెలుపుకొన్నారు.  

శరత్ అదృష్టం బాగుంది కనుక అతని సమస్య ముఖ్యమంత్రి దృష్టిలో పడింది. పరిష్కారం అయ్యింది. కానీ రాష్ట్రంలో ఇటువంటి సమస్యలు ఎదుర్కొంటూ అధికారుల చుట్టూ తిరుగుతున్న శరత్‌ వంటి రైతన్నలు కోకొల్లలు ఉన్నారు. వారిని ఎవరు ఆదుకొంటారు? 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని అజంనగర్ వాసులైన మంతు బసవయ్య (80), లక్ష్మి (70) వృద్ధ దంపతులు కూడా ఇటువంటి కష్టాలే అనుభవిస్తున్నారు. వారిరువురూ సిఎం కేసీఆర్‌ను కలిసి తమ గోడు చెప్పుకోవాలని కష్టపడి హైదరాబాద్‌ వచ్చారు. కానీ సిఎం అపాయింట్మెంట్ లేకపోవడం వలన నిరాశగా వెనుతిరిగారు. నేటికీ వారిరువురూ అధికారుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నట్లు సమాచారం. 

ప్రజాప్రతినిధులు, స్థానిక అధికారులు, జిల్లా కలెక్టర్, మంత్రులు తదితరులు ఉన్నది అటువంటివారి సమస్యలను పరిష్కరించడానికే కదా? కానీ ప్రజల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్‌ గుర్తించి స్వయంగా పరిష్కరించవలసివస్తోంది అంటే అర్ధం ఏమిటి?


Related Post