ఉపాది కల్పిస్తున్న ఎన్నికలు

March 27, 2019


img

ఎన్నికలలో ఏ పార్టీని గెలిపిస్తే ప్రజలకు ఏమి ఒరుగుతుందో తెలియదు కానీ ఎన్నికలొస్తే తప్పకుండా దేశంలో లక్షాలది మందికి ఉపాది లభిస్తుంది. ఎన్నికల సమయంలో ప్రభుత్వాలు ప్రకటించే సంక్షేమ తాయిలాలు, అభ్యర్ధులు పంచిపెట్టే డబ్బు, బహుమతులు, మందువంటివన్నీ ఎలాగూ ఉండనే ఉంటాయి. ఎన్నికలకు ముందు తరువాత పార్టీలకు అనుగుణంగా సర్వేలు చేసి ఫలితాలు చెప్పే సర్వే సంస్థలు, పెయిడ్ ఆర్టికల్స్ ప్రసారం చేసే మీడియా సంస్థలకు కూడా చేతి నిండా పనే. 

ఎన్నికల వ్యూహనిపుణులు, డేటా అనలిస్టులు, సోషల్ మీడియాలో ప్రచారకర్తలు, పార్టీ పాటలు వ్రాసేవారు, పాడేవారు, వాటి రికార్డులను తయారుచేసే ఆడియో కంపెనీలకు ఈ ఎన్నికల సమయంలో చేతి నిండా పనే. ఇక జెండాలు, బ్యానర్లు, పోస్టర్లు, టోపీలు, కండువాలు, కటవుట్లను తయారు చేసే సంస్థలు, వాటిని హోల్ సేల్, రీటైల్ గా అమ్ముకొనే వ్యాపారులు, ఆ బ్యానర్లను పెట్టుకొనే స్థలాలను అద్దెకిచ్చే సంస్థలు, పోస్టర్లను, జెండాలను అంటించేవారికి కూడా ఎన్నికలోస్తే చేతినిండాపనే. 

రాజకీయ పార్టీల బహిరంగసభలకు వేదికలను నిర్మించేవారికి, వాటి కోసం స్థలాలను చదును చేసే యంత్రాలను సప్లై చేసే కంపెనీలకు, బహిరంగసభలకు, ఊరేగింపులకు జనాలను తరలించడానికి కార్లు, లారీలు, బస్సులు, ఆటోలు మొదలైన వాహనాలను సప్లై చేసే సంస్థలకు ఫుల్ గిరాకీ ఉంటుందనే వేరే చెప్పనక్కరలేదు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ కొందరు ప్రధాన నేతలు తమ అభ్యర్ధుల తరపున ఎన్నికల ప్రచారానికి ఒకేరోజు వేర్వేరు ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది కనుక హెలికాఫ్టర్లను అద్దెకిచ్చే సంస్థలకు కూడా ఈ ఎన్నికల సమయంలో మంచి బేరాలుంటాయి. ఇలాగ ఒకటా రెండా చెప్పుకోంటూపోతే చాంతాడంత జాబితా ఉంది. 

ఏ అభ్యర్ధులు ఒంటరిగా వెళ్ళి ఎన్నికల ప్రచారం చేసుకోరు కనుక పార్టీ టోపీలు ధరించి, పార్టీ జెండాలు పట్టుకొని, నినాదాలు చేసేందుకు జనాలు కావాలి. అభ్యర్ధి ఆర్ధికశక్తిని బట్టి కనీసం 500-5,000 మంది వరకు జనాలను ఏర్పాటు చేసుకొంటారు. వారిలో మగవారికి రోజుకు రూ.500, బిర్యానీ ప్యాకెట్లు, సాయంత్రం మందుకు రూ.100 చొప్పున, అదే.. ఆడవాళ్ళకైతే రోజుకు రూ.300+ బిర్యానీ ప్యాకెట్ ఇస్తున్నారు. పార్టీ కార్యకర్తలకు మళ్ళీ వేరే లెక్క ఉంటుంది. 

ఇక ఊరేగింపులలో డప్పులు వాయించే బృందాలకు, డ్యాన్సులు చేసే బృందాలకు, అభ్యర్ధులపై పూలవాన కురిపించేవారికి, మంగళహారతులిచ్చేవారికి, పూలదండలు వేసేవారికి వేర్వేరు లెక్కలు ఉంటాయి. ఈరోజుల్లో ఒకపార్టీ తరపున ఎన్నికైన అభ్యర్ధులు వేరే పార్టీలో మారడం ఎంత కామనో అదేవిధంగా ఒక పార్టీ అభ్యర్ధి ప్రచారానికి వెళ్ళిన జనాలు వేరే పార్టీకి వెళ్లడం కూడా చాలా కామన్. ఉదయం ఒక పార్టీకి, మధ్యాహ్నం మరో పార్టీకి, సాయంత్రం ఇంకో పార్టీ అభ్యర్ధి వెనుక, రాత్రిళ్ళు సభలకువెళ్ళేవారికి ఎన్నికల సమయంలో క్షణం తీరిక ఉండదంటే అతిశయోక్తి కాదు. 

కనుక ఎన్నికల వలన లక్షల కోట్లు ఖర్చు అయిపోతుందని బాధపడేవారు ఈ ఎన్నికల వలన ఇంతమందికి ఉపాది లభిస్తోందనే సంగతి కూడా తెలుసుకొంటే మంచిది. దేశంలో సార్వత్రిక ఎన్నికల హడావుడి ఇప్పుడు మొదలైంది. కానీ తెలంగాణ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరిగినందున గత ఏడాది సెప్టెంబరు నుంచే ఈ హడావుడి మొదలైంది. అప్పటి నుంచి ఏప్రిల్ 9న ఎన్నికల ప్రచారం ముగిసేవరకు అందరికీ చేతినిండా పనే. కనుక పార్టీలు, అభ్యర్ధులు ఎవరైనప్పటికీ మన ప్రజాస్వామ్యం జిందాబాద్....ఎన్నికలు జిందాబాద్! అనుకోవలసిందే.


Related Post