సిఎం పదవి ఇస్తే జగన్ 1,500 కోట్లు ఇస్తానన్నారు: ఫరూక్

March 27, 2019


img

సిఎం పదవి ఇస్తే జగన్ 1,500 కోట్లు ఇస్తానన్నారని జమ్ముకశ్మీర్‌ మాజీ సిఎం ఫరూక్ అబ్దుల్లా సంచలన విషయం బయటపెట్టారు. కశ్మీర్‌కు చెందిన ఆయనకు ఏపీకి చెందిన జగన్‌మోహన్‌రెడ్డి సిఎం పదవి కోసం 1,500కోట్లు ఇస్తాననడం ఏమిటి? అనే సందేహం కలగడం సహజం.

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ఫరూక్ అబ్దుల్లాను సిఎం చంద్రబాబునాయుడు ఏపీకి రప్పించారు. ముస్లింలు ఎక్కువగా ఉండే కర్నూలు జిల్లాలో, వైసీపీ కంచుకోటగా చెప్పుకోబడే కడప జిల్లాలో మంగళవారం ఫరూక్ తో కలిసి చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఫరూక్ అబ్దుల్లా ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత జగన్‌మోహన్‌రెడ్డి ఓసారి మా ఇంటికి వచ్చారు. తనను ఏపీ సిఎం చేసినట్లయితే కాంగ్రెస్ పార్టీకి 1,500 కోట్లు విరాళం ఇవ్వడానికి సిద్దంగా ఉన్నానని నాతో చెప్పారు. ఆయనకు ఎంత పదవి వ్యామోహం ఉందో అప్పుడే నాకు అర్దమైంది. అసలు ఆయనకు అంతా డబ్బు ఎక్కడిది? ఆయనకు భూమిలో నిధులేమైనా ఉన్నాయా? ఆ డబ్బు ఆయన దోచుకొని సంపాదించినదేనని భావిస్తున్నాను. డబ్బుతో ఏమైనా చేయోచ్చు..ఎవరినైనా కొనేయవచ్చు...ఏ పదవులనైనా కొనుక్కోవచ్చుననే జగన్‌మోహన్‌రెడ్డి వంటి వ్యక్తిని ఎన్నుకొని అధికారం కట్టబెడితే ఆయన తన భవిష్యత్తును చక్కదిద్దుకొని మీ భవిష్యత్తును నాశనం చేస్తారు. కనుక అటువంటి వ్యక్తి పట్ల ఏపీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి,” అని అన్నారు. 

వైఎస్ రాజశేఖర్ రెడ్డి చనిపోయిన తరువాత జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి కావాలని చాలా ఆరాటపడిన మాట నిజం. అందుకోసం గట్టి ప్రయత్నాలు చేసిన మాట కూడా నిజమేనని అందరికీ తెలుసు. కనుక తనను ముఖ్యమంత్రిని చేస్తే కాంగ్రెస్ పార్టీకి 1,500 కోట్లు విరాళం ఇస్తానని ఫరూక్ ద్వారా రాయబారం చేయాలని ప్రయత్నించి ఉండవచ్చు. 

ఫరూక్ చెపుతున్నది అబద్దం అయ్యుండవచ్చు కూడా. ఎందుకంటే, ఇది కూడా బాబు ఎన్నికల వ్యూహంలో భాగమే అయ్యుండవచ్చు. ఎన్నికల ప్రచారం కీలకదశకు చేరుకొన్నప్పుడు ఫరూక్ వంటి నేత జగన్‌కు వ్యతిరేకంగా ఇటువంటి మాటలు చెపితే ఓటర్లపై ఎంత ప్రభావం ఉంటుందో తేలికగానే ఊహించుకోవచ్చు. కనుక దీనిని చంద్రబాబునాయుడు జగన్‌పై సందించిన మొదటి అస్త్రంగా భావించవచ్చు. ఆయన వద్ద ఇటువంటివి ఇంకా ఎన్ని అస్త్రాలు ఉన్నాయో... వాటిని జగన్‌మోహన్‌రెడ్డి ఏవిధంగా తిప్పికొడతారో చూడాలి.


Related Post