ఎమ్మెల్సీ ఎన్నికలలో జీవన్‌రెడ్డి విజయం

March 27, 2019


img

కరీంనగర్‌-ఆదిలాబాద్‌-నిజామాబాద్‌-మెదక్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీనియర్ కాంగ్రెస్‌ నేత టి. జీవన్‌రెడ్డి విజయం సాధించారు. ఈ ఒక్క సీటుకు 17 మంది అభ్యర్ధులు పోటీ పడినప్పటికీ జీవన్‌రెడ్డి తొలి ప్రాధాన్యత ఓటుతోనే సునాయాసంగా విజయం సాధించడం విశేషం. తెరాస బలపరిచిన పాతూరి సుధాకర్‌ రెడ్డి ఓటమి పాలయ్యారు. ఒకవేళ ఈ ఎన్నికలలో జీవన్ రెడ్డి ఓడిపోయుంటే, శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండా పోయేది.    

ఇక కరీంనగర్‌ పట్టభద్రుల నియోజకవర్గంలో పీఆర్టీయూ అభ్యర్థి రఘోత్తం రెడ్డి విజయం సాధించారు. తెరాస మద్దతుతో ఎమ్మెల్సీ ఎన్నికలలో సునాయాసంగా విజయం సాధించవచ్చుననే నమ్మకంతో గ్రూప్-1 ఉద్యోగానికి రాజీనామా చేసి బరిలో దిగిన మామిండ్ల చంద్రశేఖర్‌ అనూహ్యంగా ఓడిపోయారు. 

నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఉపాద్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా తెరాసకు ఎదురుదెబ్బ తగిలింది. సిపిఎం బలపరిచిన టి.ఎస్.యు.టి.ఎఫ్. అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి చేతిలో తెరాస బలపరిచిన పి.ఆర్.టి.యు.అభ్యర్ధి పూల రవీందర్ ఓడిపోయారు. 

అసెంబ్లీ ఎన్నికలలో ఘనవిజయం సాధించిన తెరాస ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా సునాయాసంగా విజయం సాధిస్తుందనుకొంటే మూడు ఎమ్మెల్సీ స్థానాలలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్ధులు ఓడిపోవడం తెరాసకు పెద్ద షాకే అని చెప్పవచ్చు. ఎమ్మెల్యేలు, ముఖ్య నేతల పార్టీ ఫిరాయింపులతో డీలాపడిన కాంగ్రెస్ పార్టీకి, లోక్‌సభ ఎన్నికలకు ముందు వెలువడిన ఈ ఫలితాలు కొత్త ఉత్సాహాన్ని కలిగించవచ్చు.


Related Post