ఇమ్రాన్ ఖాన్ తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే...

March 26, 2019


img

“భారత్‌లో ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు భారత్‌-పాక్‌ల మద్య ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని కనుక భారత్‌ మళ్ళీ ఎటువంటి దుస్సాహసం చేసినా తిప్పి కొట్టడానికి సిద్దంగా ఉన్నామని” పాక్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ అన్నారు.

అంటే ఎన్నికలలో లబ్ది పొందేందుకే మోడీ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా పాక్‌పై దాడి చేసిందని, అదే ఉద్దేశ్యంతో మళ్ళీ పాక్‌ పై దాడికి ప్రయత్నించవచ్చునని ఇమ్రాన్ ఖాన్‌ చెపుతున్నారని భావించవచ్చు. కానీ భారత్‌-పాక్‌ మద్య అకస్మాత్తుగా యుద్ధవాతావరణం ఎందుకు ఏర్పడింది? అని ఎవరూ ఆలోచించడం లేదు. పుల్వామాలో 40 మంది జవాన్లను ఉగ్రవాదులు బలి తీసుకొన్నందుకే ప్రధాని నరేంద్రమోడీ ఈ సాహసోపేతమైన నిర్ణయం తీసుకొన్నారనే విషయం అందరికీ తెలుసు. ఇదే ఘటన అమెరికాలో జరిగి ఉండి ఉంటే అమెరికా ప్రభుత్వం ఇంతకంటే తీవ్రస్థాయిలోనే ప్రతీకారం తీర్చుకొంటుందని అందరికీ తెలుసు. కానీ సరిగ్గా ఎన్నికలకు ముందు పుల్వామా దాడి జరుగడంతో ప్రధాని నరేంద్రమోడీ తీసుకొన్న నిర్ణయాలను ఇమ్రాన్ ఖాన్‌తో సహా దేశంలో ప్రతిపక్షాలు కూడా వేలెత్తి చూపుతున్నాయి. 

 పాకిస్థాన్‌ పొరుగుదేశం, భారత్‌ను శత్రువుగా భావిస్తోంది కనుక ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ ఈవిధంగా మాట్లాడటం పెద్ద వింతేమీ కాదు. కానీ భారత్‌లోని ప్రతిపక్షాలు, రాజకీయ నాయకులు, మేధావులు కూడా ఇమ్రాన్ ఖాన్‌ వాదనలను దృవీకరిస్తున్నట్లు మాట్లాడుతుండటం చాలా దురదృష్టకరం.       

పుల్వామా దాడిలో మన జవాన్లు మరణిస్తే నరేంద్రమోడీ కూడా కాంగ్రెస్‌ ప్రధానులు మాదిరిగా ఓ సంతాపం సందేశం, ఒక ఖండన ప్రకటన చేసి చేతులు దులుపుకొంటే సరిపోతుందని ప్రతిపక్షాలు భావిస్తున్నాయేమో? కానీ మోడీ వారి ఊహలకు భిన్నంగా సర్జికల్ స్ట్రైక్ చేయించి ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకొని అటు భారత సైనికులకు, ఇటు కోట్లాది దేశప్రజలకు సంతృప్తి కలిగించారు. వారి సంతృప్తి ఎన్నికలలో బిజెపికి లబ్ది కలుగుతుందేమోనని ప్రతిపక్షాల భయం. వారి భయాలు, రాజకీయ కారణాల కోసం కేంద్రప్రభుత్వం చేతులు ముడుచుకొని కూర్చోలేదు కదా? భారత్‌లో ఎవరు అధికారంలో ఉన్నప్పటికీ పాక్‌పై దాడి చేయాలని ఏ ప్రభుత్వమూ కోరుకోదు. కానీ భారత్‌ ప్రజల, జవాన్ల ప్రాణాలు పోతున్నా చేతులు ముడుచుకొని కూర్చోమంటే సాధ్యం కాదని ఇమ్రాన్ ఖాన్‌ కూడా గ్రహిస్తే మంచిది. 


Related Post