వైసీపీలో చేరిన మోహన్ బాబు

March 26, 2019


img

ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు ఇద్దరూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.  ఈరోజు ఉదయం వారిరువురూ హైదరాబాద్‌లోని జగన్ నివాసం లోటస్ పాండ్ చేరుకొని ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. మోహన్ బాబు స్వర్గీయ ఎన్టీఆర్ వీరాభిమాని. ఆ కారణంగా ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీలో చేరారు. టిడిపి ద్వారా రాజ్యసభకు వెళ్లారు. కానీ టిడిపి ఎన్టీఆర్ చేతుల్లో నుంచి చంద్రబాబునాయుడు చేతుల్లోకి వెళ్ళిపోయిన తరువాత ఆయన పార్టీని వీడి బయటకు వచ్చేశారు. ఆ తరువాత మరే పార్టీలో చేరకపోయినప్పటికీ టిడిపిలో సంపాదించిన రాజకీయ అనుభవంతో వర్తమాన రాజకీయాలపై, నేతలపై మోహన్ బాబు తన అభిప్రాయాలు వెల్లడిస్తూనే ఉండేవారు. మళ్ళీ రాజకీయాలలో ప్రవేశించాలని మోహన్ బాబు చాలా కాలంగా అనుకొంటున్నప్పటీకీ ఆ బురద మళ్ళీ అంటించుకోవడం ఎందుకనే ఉద్దేశ్యంతో ఇంతకాలం రాజకీయాలకు దూరంగా ఉన్నారు. 

చిత్తూరులోని ఆయనకు చెందిన శ్రీవిద్యా నికేతన్ విద్యాసంస్థలకు బకాయిపడిన విద్యార్ధుల ఫీజు రీ-ఎంబర్స్మెంటు చెల్లించవలసిందిగా మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి ఎన్నిసార్లు చేసినప్పటికీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో మూడు రోజుల క్రితం తన విద్యార్ధులతో కలిసి రోడ్డుపై కూర్చొని ప్రభుత్వానికి నిరసన తెలియజేశారు. ఆయన చర్యలను టిడిపి నేతలు ఖండించారు. వైసీపీ ప్రభావంలో ఉన్న ఆయన ఎన్నికలకు ముందు రాజకీయ దురుదేశ్యంతోనే తమ ప్రభుత్వంపై ఈవిధంగా బురద జల్లుతున్నారని టిడిపి ఆరోపించింది. రాజకీయాలలో చేరాలా వద్దా అని ఇంతవరకు ఊగిసలాడుతున్న మోహన్ బాబు ఈ వివాదంతో రాజకీయాలలో ప్రవేశించడానికి కారణమైంది. ఇప్పటి వరకు ఒంటరిగా పోరాడుతున్న ఆయన ఇప్పుడు వైసీపీ తరపున టిడిపితో యుద్దం చేయబోతున్నారు.


Related Post