తెరాసకు జితేందర్ రెడ్డి షాక్?

March 26, 2019


img

తెరాస సిట్టింగ్ ఎంపీ జితేందర్ రెడ్డికి లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసేందుకు సిఎం కేసీఆర్‌ టికెట్ నిరాకరించడంతో ఆయన తీవ్ర అసంతృప్తికి గురైనప్పటికీ కేసీఆర్‌ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, తెరాసలోనే కొనసాగుతానని చెప్పారు. కానీ ఆయన ఈనెల 29వ తేదీన ప్రధాని నరేంద్రమోడీ సమక్షంలో బిజెపిలో చేరబోతున్నట్లు తాజా సమాచారం. 

కేసీఆర్‌ ఆయనకు టికెట్ నిరాకరించడంతో బిజెపి నేతలు వెంటనే ఆయనను కలుసుకొని పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానించారు. కొందరు బిజెపి ముఖ్య నేతలు సోమవారం జితేందర్ రెడ్డిని హైదరాబాద్‌లో ఆయన నివాసంలో కలిసి చాలాసేపు చర్చించారు. అనంతరం బిజెపి ప్రధానకార్యదర్శి రాంమాధవ్ కూడా వచ్చి ఆయనతో మాట్లాడారు. బిజెపిలో చేరితే రాజ్యసభ సీటు ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చినట్లు సమాచారం. దానితో పాటు బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షపదవిని కూడా ఇవ్వాలని జితేందర్ రెడ్డి కోరగా అందుకు రాంమాధవ్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కనుక జితేందర్ రెడ్డి బిజెపిలో చేరిక తధ్యమనే భావించవచ్చు. కనుక నేడో రేపో జితేందర్ రెడ్డి బిజెపి నేతలతో కలిసి డిల్లీ వెళ్ళి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను, ప్రధాని నరేంద్రమోడీని కలువబోతున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 29న మహబూబ్‌నగర్‌లో జరుగబోయే బహిరంగసభలో ప్రధాని మోడీ సమక్షంలో బిజెపిలో చేరవచ్చునని తాజా సమాచారం. 

ఇప్పటికే జిల్లాకు చెందిన సీనియర్ కాంగ్రెస్‌ నేత డికె అరుణ బిజెపిలో చేరి మహబూబ్‌నగర్‌ నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్నారు. జితేందర్ రెడ్డి కూడా బిజెపిలో చేరినట్లయితే మహబూబ్‌నగర్‌లో తెరాస అభ్యర్ధి  మన్నె శ్రీనివాస్‌రెడ్డికి ఎదురీత తప్పకపోవచ్చు. ఒకవేళ ఆయనకు పార్టీ పగ్గాలు అప్పగించినట్లయితే రాష్ట్రంలో తెరాసలో అసంతృప్తనేతలతో సహా ఇతర పార్టీల నుంచి నేతలు బిజెపిలో చేరే అవకాశం కూడా ఉంటుంది.


Related Post