పసుపు బోర్డు ఏర్పాటుపై బిజెపి అబద్దాలు

March 26, 2019


img

నిజామాబాద్‌ జిల్లాలో ఆర్మూరులో సోమవారం రాత్రి నిర్వహించిన బహిరంగసభలో కార్యదర్శి రాంమాధవ్ ప్రజలను ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “కేంద్రంలో మా ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి రాగానే జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తాము. ఈ హామీని మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చేర్చాము. జిల్లాలో పసుపుబోర్డు ఏర్పాటు చేయాలని నిజామాబాద్‌ ఎంపీ కవిత కేంద్రప్రభుత్వాన్ని కోరలేదని, కోరి ఉంటే ఎప్పుడో ఏర్పాటు చేసి ఉండేవాళ్ళం. నిజామాబాద్‌ లోక్‌సభ బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్ రైతు ప్రతినిధులతో కలిసి డిల్లీకి వచ్చి ఈ సమస్యను మా దృష్టికి తీసుకురావడంతో మేము దీనిని మా మేనిఫెస్టోలో చేర్చి అమలుచేయాలని నిర్ణయించుకొన్నాము. అలాగే పసుపు, ఎర్రజొన్న, చెరుకు రైతుల సమస్యను కూడా అరవింద్ కేంద్రం దృష్టికి తీసుకువచ్చారు. కనుక వారికి కనీస మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇస్తున్నాము. కనీస మద్దతుధర ప్రకటించని వ్యవసాయ ఉత్పత్తులకు మార్కెట్ ధర ఉత్పత్తి ధర కంటే తక్కువగా ఉన్నట్లయితే కేంద్రప్రభుత్వమే ఆ లోటును భర్తీ చేస్తుందని హామీ ఇస్తున్నాము. రాష్ట్ర ప్రభుత్వంతో సంబందం లేకుండా ఆ సొమ్మును కేంద్రప్రభుత్వమే నేరుగా రైతుల ఖాతాలో జమా చేస్తుంది. నిజామాబాద్‌ జిల్లాలో మూతబడిన మిల్లులను కూడా తిరిగి తెరిపించి చెరుకు రైతులను ఆడుకొంటామని హామీ ఇస్తున్నాను,” అని అన్నారు. 

నిజామాబాద్‌లో పసుపు బోర్డు ఏర్పాటు చేయాలని తెరాస ఎంపీ కవిత గత నాలుగున్నరేళ్ళుగా కేంద్రంపై ఒత్తిడి తెస్తున్న సంగతి అందరికీ తెలుసు. కానీ కొన్ని సాంకేతిక కారణాల వలన ఏర్పాటు చేయలేకపోతున్నామని కేంద్రం సమాధానం చెప్పినట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఏనాడూ దీనికొరకు కేంద్రప్రభుత్వాన్ని కోరలేదని, కోరి ఉంటే ఎప్పుడో ఏర్పాటు చేసి ఉండేవారమని బిజెపి  జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

అలాగే పసుపు, ఎర్రజొన్న, చెరుకు, మిర్చి, వారి తదితర వ్యవసాయోత్పత్తులకు గిట్టుబాటు కల్పించాలని, వాటిని నిలువ చేసుకొనేందుకు గిడ్డంగులు నిర్మించాలని, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలని రైతులు కోరుతున్నారు. రైతుల సమస్యలు, వారు పడుతున్న కష్టాలు సామాన్యప్రజలకు కూడా తెలుసు. కనుక కేంద్రప్రభుత్వానికి తెలియవనుకోలేము. ఈ సమస్యలను తెరాస ఎంపీలు చాలాసార్లు కేంద్రమంత్రులకు మొరపెట్టుకొన్నారు కూడా. కానీ బిజెపి నేతలు ఇవన్నీ ఇప్పుడే కనుగొన్నట్లు మాట్లాడటమే విచిత్రం.


Related Post