జైపాల్ రెడ్డికి ఆ బాధ్యత ఉందా లేదా?

March 26, 2019


img

మహబూబ్‌నగర్‌ లోక్‌సభ నియోజకవర్గంలో సోమవారం కాంగ్రెస్‌ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. దానిలో మాజీ కేంద్రమంత్రి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, “డికె అరుణకు ఓటు వేస్తే బిజెపికి వేస్తున్నామని అందరికీ తెలుసు. కానీ తెరాసకు ఓటు వేసిన బిజెపికే ఓటు వేసినట్లేనని అందరూ గ్రహించాలి. లోక్‌సభ ఎన్నికల తరువాత అవసరంపడితే కెసిఆర్ నరేంద్రమోడీకి తప్పకుండా మద్దతు ఇస్తారు. దాని కోసమే ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కేసీఆర్‌ ఆడిన నాటకాలను, పన్నిన్న వ్యూహాలను ప్రజలందరూ కూడా చూశారు. ఆనాడు ఫ్ల్యూయిడ్స్ ఎక్కించుకొంటూ కేసీఆర్‌ ఆసుపత్రిలో దొంగదీక్షలు చేశారు. ఆ సంగతి నేను గ్రహించినప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనే ఉద్దేశ్యంతో నోరుమూసుకొన్నాను. తెలంగాణ సాధన కోసం తాను పోరాడుతుంటే నేను మంత్రిపదవి పట్టుకొని వ్రేలాడానని కేసీఆర్‌ విమర్శించడం సరికాదు. ఆనాడు నేను కేంద్రమంత్రి పదవిలో ఉండబట్టే పార్లమెంటులో తెలంగాణ బిల్లు ఆమోదం పొందగలిగిందనే సంగతి కేసీఆర్‌కు కూడా తెలుసు. గత ఎన్నికలలో తెలంగాణ సెంటిమెంటు రాజేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌, ఈసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసి అధికారం చేజిక్కించుకొన్నారు. కానీ లోక్‌సభ ఎన్నికలలో ఆయన ఎత్తులు, జిత్తులు ఏమీ పారవు. ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించబోతోంది. కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతోంది,” అన్నారు జైపాల్ రెడ్డి. 

తెలంగాణ సాధనకు ఎవరెవరు ఏమి చేశారో...తెలంగాణ ఏర్పడిన తరువాత రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామల గురించి అందరికీ తెలుసు. కనుక వాటి గురించి ఇప్పుడు చర్చ అనవసరం. అసెంబ్లీ ఎన్నికలలో ఆయన అంతా క్రియాశీలంగా వ్యవహరించలేదు. బహుశః డికె అరుణతో ఉన్న వర్గ విభేధాలే అందుకు కారణం అయ్యుండవచ్చు. ఆమె పార్టీలో ఉన్నంతకాలం మౌనంవహించి ఆమె పార్టీ వీడిన తరువాత ఇప్పుడు నిందించి ఏమి ప్రయోజనం?

కేంద్రమంత్రిగా చేసి జాతీయస్థాయి నాయకుడిగా గుర్తింపు పొందిన ఆయన పార్టీని ఎన్నికలలో గెలిపించలేకపోయినా కనీసం పార్టీని కాపాడుకోవడానికి చొరవ తీసుకోకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. పైగా రాష్ట్రంలో తెరాసకు ఎదురు నిలిచి పోరాడి విజయం సాధించడం కష్టమనే భయంతో ఆయన లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయడానికి కూడా భయపడ్డారు. పరిస్థితులన్నీ సానుకూలంగా ఉన్నప్పుడు పోటీ చేసి గెలవడం గొప్ప విషయం కాదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ముఖ్యంగా ఇటువంటి సమయంలోనే జైపాల్ రెడ్డి వంటి సీనియర్ నేతలు బరిలో దిగి పార్టీకి అండగా నిలబడితే ఒకవేళ ఓడిపోయినా కూడా ఆయనకు గౌరవంగా ఉండేది. కానీ ఇప్పుడు తాపీగా చరిత్ర పాఠాలు వల్లెవేస్తూ కూర్చోంటే ఏదో ఒకరోజు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కూడా చరిత్రలో భాగంగా మారిపోవచ్చు. కనుక కాంగ్రెస్‌ పార్టీని కాపాడుకోవలసిన బాధ్యత జైపాల్ రెడ్డికి ఉందా లేదా? ఉంటే ఏమి చేయగలరు? అనే ప్రశ్నలకు ఆయనే సమాధానం చెప్పాలి.


Related Post