నిజామాబాద్‌లో 245 నామినేషన్లు దాఖలు

March 25, 2019


img

నిజామాబాద్‌ లోక్‌సభ స్థానానికి 245 నామినేషన్లు దాఖలైనట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ మీడియాకు తెలియజేశారు. జిల్లాలో పసుపు, ఎర్రజొన్న రైతులు తమ పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ ఎన్నిసార్లు ఆందోళనలు చేసినప్పటికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వారి గోడును పట్టించుకోకపోవడంతో, వారు భారీ సంఖ్యలో నామినేషన్లు వేసి తమ నిరసన తెలియజేశారు. ఖమ్మం జిల్లాలో కూడా సుబాబుల్ రైతులు తమ పంటకు గిట్టుబాటు ధర కల్పించనందుకు నిరసనగా భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. 

ప్రస్తుతం ఉన్న ఈవీఎం మెషిన్లలో అంతమంది అభ్యర్ధులకు చోటు కల్పించడం కష్టం కనుక బ్యాలెట్ పేపర్లు ముద్రించవలసి రావచ్చు. కానీ తెరాస నేతలు రైతులకు నచ్చజెప్పి వారిచేత నామినేషన్లు ఉపసంహరింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. కనుక ఈనెల 28వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తరువాత ఖమ్మం, నిజామాబాద్‌ నియోజకవర్గాలలో ఎంతమంది అభ్యర్ధులు బరిలో మిగులుతారో తెలుస్తుంది.



Related Post