పాపం పాల్! మోడీ, ట్రంపుతో పరిచయాలున్నా...

March 25, 2019


img

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ.పాల్‌ పేరు వినగానే అందరి మొహం మీద చిరునవ్వు వస్తుంది. అలాగని ఆయనేమీ సినిమాలలో బ్రహ్మానందం, అలీ వంటి గొప్ప హాస్యనటుడు కాదు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మొదలు భారత్‌, పాకిస్థాన్‌, చైనా, ఫ్రాన్స్ వంటి దేశాధినేతలందరితో తాను నేరుగా మాట్లాడగలనని గొప్పలు చెప్పుకొంటారు కనుకనే అందరూ ఆయన మాటలు విని ముసిముసినవ్వులు నవ్వుకొంటారు. అయితే ట్రంప్, మోడీ, సోనియా, రాహుల్, చంద్రబాబు, కేసీఆర్‌లతో ఉన్న పరిచయాలు ఏవీ ఈరోజు ఆయనకు ఉపయోగపడలేదు. మధ్యాహ్నం 3గంటలతో నామినేషన్ స్వీకరణకు గడువు కాగా, పాల్ కాస్త ఆలస్యంగా రావడంతో భీమవరం రిటర్నింగ్ అధికారి ఆయన నామినేషన్ తీసుకోవడానికి నిరాకరించారు.  

అప్పుడు కెఏపాల్ ఏవిధంగా స్పందించారో తెలుసుకోవద్దా?ఆయన మీడియాతో మాట్లాడుతూ, “నా ప్రతినిధి మధ్యాహ్నం 2.40 గంటలకే నా తరపున నామినేషన్ పత్రాలు సమర్పించడానికి వచ్చారు. కానీ నేను రావడం కాస్త ఆలస్యం అవడంతో నా నామినేషన్ పత్రాలు తీసుకోవడానికి రిటర్నింగ్ అధికారి నిరాకరించారు. నేను భీమవరం నుంచి నామినేషన్ వేస్తున్నానంటే పవన్, జగన్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. చంద్రబాబు, పవన్, జగన్ ముగ్గురూ కలిసి నేను నామినేషన్ వేయనీయకుండా కుట్రపన్నారు. నరసాపురంలో నా నామినేషన్ ప్రక్రియ ఆలస్యం అయ్యేలా చేసి, నేను సమయానికి భీమవరం చేరుకోకుండా చేశారు. అయితే మరేమీ పరువాలేదు. నేను నర్సాపురం నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఆ మూడుపార్టీలను చిత్తుచిత్తుగా ఓడిస్తాను. ఆ తరువాత ఏడాదిలో నర్సాపురాన్ని నార్త్ అమెరికాలాగ మార్చేస్తాను. నర్సాపురంలో విమానాశ్రయం ఏర్పాటు చేయిస్తాను. ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పిస్తాను. నేను గెలిచిన తరువాత నర్సాపురం ఎంత అభివృద్ధి చెందుతుందో మీరే చూస్తారు. హెలికాఫ్టర్ ధాటికి తుప్పు పట్టిన ఫ్యాను (వైసీపీ)రెక్కలు, సైకిలు(టిడిపి), గాజు గ్లాసు(జనసేన) అన్నీ విరిగిపోతాయి,” అని కెఏ పాల్ అన్నారు. 

కెఏపాల్ నర్సాపురం నుంచి శాసనసభతో పాటు లోక్‌సభకు, భీమవరం నుంచి శాసనసభకు పోటీ చేయాలనుకొన్నారు. కానీ నేడు నర్సాపురంలో మాత్రమే రెండు స్థానాలకు నామినేషన్స్ వేయగలిగారు. కెఏ పాల్ లోక్‌సభ ఎంపీగా ఎన్నికైతే ప్రధానమంత్రి పదవి చేపట్టాలనుకోవచ్చు కనుక ఇప్పుడు నరేంద్రమోడీ, రాహుల్ గాంధీ కొంచెం జాగ్రత్తగా ఉండక తప్పదు.


Related Post