హరీష్‌రావు మెదక్ కు పరిమితం చేయబడ్డారా?

March 25, 2019


img

ఈసారి లోక్‌సభ ఎన్నికలలో కేటీఆర్‌ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తూ ఒంటిచేత్తో పార్టీ అభ్యర్ధులను గెలిపించుకొనేందుకు ప్రయత్నిస్తుంటే హరీష్‌రావు మాత్రం మెదక్ నియోజకవర్గానికే అంకితం అవడం విశేషం. కేటీఆర్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కనుక ఆయన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలను చూసుకోవలసిన బాధ్యత ఉందని తెరాస సర్దిచెప్పుకోవచ్చు. కానీ తెరాస 20 మంది స్టార్ క్యాంపెయినర్స్ జాబితాలో హరీష్‌రావు పేరు లేకపోవడం ఆలోచింపజేస్తోంది. 

పార్టీలో చాలా సీనియర్ నేత, మంచి సమర్ధుడు, అత్యంత ప్రజాధారణ కలిగిన నాయకుడు, ముఖ్యంగా మంచి ఎన్నికల వ్యూహకర్త అని పేరొందిన హరీష్‌రావును లోక్‌సభ ఎన్నికలలో తెరాస ఉపయోగించుకోకపోవడం అంటే పక్కను పెట్టడమేనని రాజకీయ విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ ఊహాగానాలను కేటీఆర్‌ ఖండించారు. 

ఒక ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ కు ఆదివారం ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో ఇదే అంశంపై అడిగిన ఒక ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం చెపుతూ, “మీడియాకు ఎప్పుడూ మసాలా న్యూస్ కావాలి. అందుకే ఇటువంటి పుకార్లు లేదా ఊహాగానాలు సృష్టిస్తుంటుంది. పార్టీలో నాకు, హరీష్‌రావుతో సహా అందరికీ వేర్వేరు బాధ్యతలు అప్పగించబడ్డాయి. అందరం వాటిని నిర్వర్తిస్తున్నాము తప్ప ఒకరు ఎక్కువ మరొకరు తక్కువ అనేది ఉండదు. 

హరీష్‌రావును పక్కనపెట్టామనేది కేవలం మీడియా సృష్టే. మీడియా నాపై ఎక్కువ ఫోకస్ చేస్తుండటం వలన తెరాసలో నాకు ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోందనే తప్పుడు అభిప్రాయం నెలకొంది. కానీ హరీష్‌రావు ఏమి చేస్తున్నారో ఒకసారి మీ మీడియా బృందాలు వెళ్ళి పరిశీలిస్తే ఆయన పార్టీలో ఎంత కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారో అర్ధం అవుతుంది. అలాగే నాకు, హరీష్‌రావుకు మద్య ఏనాడూ ఎటువంటి భేధాభిప్రాయాలు లేవు. రాలేదు. కానీ ఉన్నాయనో లేదా వచ్చాయనో వస్తున్న వార్తలు కూడా మీ మీడియా సృష్టే!” అని అన్నారు. 

 “గతంలో ఎటువంటి పదవులు లేకుండా నేను కూడా పార్టీ కోసం పనిచేశాను. ఇప్పుడూ మంత్రి పదవి లేదు. అంటే దానార్ధం నన్ను పక్కన పెట్టినట్లు కాదు కదా? మంత్రిపదవో లేదా పార్టీ పదవో లభించనంతమాత్రన్న ఎవరినీ పక్కనపెట్టినట్లు కాదూ,” అని కేటీఆర్‌ అన్నారు.

“కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో పాల్గొనేందుకు డిల్లీ వెళ్లిపోతే అప్పుడు మీరే ముఖ్యమంత్రి అవుతారు కదా?” అనే ప్రశ్నకు సమాధానంగా, “ఊహాజనితమైన ఇటువంటి ప్రశ్నలకు నా దగ్గర సమాధానాలు లేవు. జాతీయ రాజకీయాలలో పాల్గొనేందుకు కేసీఆర్‌ డిల్లీ వెళ్లిపోనవసరం లేదు. హైదరాబాద్‌లో ఉంటూనే పాల్గొనవచ్చు. నాకున్న రాజకీయ, పరిపాలనానుభవానికి మంత్రిపదవే ఎక్కువ ఇక ముఖ్యమంత్రి పదవి ఎందుకు ఆశిస్తాను? తెలంగాణ రాష్ట్రానికి కేసీఆరే మరో 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండాలని ఒక రాష్ట్ర పౌరుడిగా నేను కూడా కోరుకొంటున్నాను,” అని అన్నారు.    

హరీష్‌రావు విషయంలో కేటీఆర్‌ ఎంత సర్దిచెప్పుకొన్నప్పటికీ, పార్టీలో, ప్రభుత్వంలో కేటీఆర్‌కు ఉన్నంత ప్రాధాన్యం హరీష్‌రావుకు లేదనేది అందరికీ తెలిసిన రహస్యం. గ్రేటర్ ఎన్నికల తరువాత కేటీఆర్‌ ఏవిధంగా ప్రమోట్ అయ్యారో అందరికీ తెలుసు. కనుక ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలలో కీలకపాత్ర పోషిస్తున్న కేటీఆర్‌ అదేవిధంగా ‘ముఖ్యమంత్రిగా’  ప్రమోట్ అయ్యే సూచనలు ఉన్నాయని భావించవచ్చు. లోక్‌సభ ఎన్నికల తరువాత అన్నీ అనుకూలిస్తే కేసీఆర్‌ డిల్లీ రాజకీయాలకు షిఫ్ట్ అవడం కేటీఆర్‌ ముఖ్యమంత్రి కావడం ఖాయమనే భావించవచ్చు. నిజానికి ఈ ఉద్దేశ్యంతోనే కేసీఆర్‌ హటాత్తుగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రతిపాదన తెరపైకి తెచ్చారని కాంగ్రెస్‌, బిజెపి నేతలు వాదిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. మరి పార్టీలో, ప్రభుత్వంలో హరీష్‌రావు స్థానం ఏమిటనే ప్రశ్నకు కాలమే జవాబు చెపుతుంది. 


Related Post