వ్యూహాలు అమలులో కాంగ్రెస్‌ వైఫల్యం?

March 25, 2019


img

ఎన్నికల వ్యూహాలను సమర్ధంగా అమలుచేసి సత్ఫలితాలను రాబట్టడంలో కేసీఆర్‌ను మించినవారు లేరని ఇప్పటికే అనేకసార్లు నిరూపితమైంది. కాంగ్రెస్ పార్టీ కూడా మంచి వ్యూహాలనే రచిస్తుంది కానీ ఆ పార్టీలో జాతీయస్థాయి నాయకుల మద్య ఉన్న అవగాహన రాష్ట్ర స్థాయి నాయకుల మద్య కనిపించదు. అందుకే కాంగ్రెస్ అధిష్టానం రూపొందించిన వ్యూహాలు రాష్ట్రాల స్థాయిలో సమర్ధంగా అమలుకాక తరచూ ఓటమిపాలవుతుంటుంది. 

ఉదాహరణకు అసెంబ్లీ ఎన్నికలలో తెరాసను ఓడించడానికి టిడిపి, సిపిఐ, టిజేఎస్‌ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ప్రజాకూటమిని ఏర్పాటు చేసింది. కానీ దానిని సకాలంలో పట్టాలు ఎక్కించడంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు అలసత్వం ప్రదర్శించడంతో ఆ వ్యూహం ఫలించలేదు. కానీ కాంగ్రెస్‌ వ్యూహాన్ని సకాలంలో పసిగట్టిన కేసీఆర్‌, ప్రజాకూటమిలో ‘చంద్రబాబునాయుడు అనే బూచిని’ సమర్ధంగా హైలైట్ చేయగలిగారు. అలాగే కాంగ్రెస్‌ కూటమిని గెలిపిస్తే రాష్ట్రం మళ్ళీ ‘పరాయిపాలన’లోకి వెళ్లిపోతుందని గట్టిగా వాదించి ప్రజలను మెప్పించగలిగారు. 

మళ్ళీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికలొచ్చాయి. వాటికోసం కూడా కాంగ్రెస్‌ అధిష్టానం ఒక వ్యూహం రచించింది. అదేమిటంటే, ‘ఈ ఎన్నికలు రాహుల్ గాంధీ-నరేంద్రమోడీకి మద్య జరుగుతున్న ఎన్నికలని, ఇవి ప్రధానమంత్రిని ఎన్నుకొనేందుకు జరుగుతున్న ఎన్నికలే తప్ప వీటిలో ప్రాంతీయపార్టీలు చేసేదేమీ ఉండదనేది’ ఆ వ్యూహం. అయితే షరా మామూలుగా రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఈ వాదనను గట్టిగా వినిపించి ప్రజలను మెప్పించడంలో తీవ్ర అలసత్వం ప్రదర్శిస్తున్నారు. 

షరామామూలుగా కాంగ్రెస్‌ తన ఈ వ్యూహాన్ని అమలుచేయలేకపోతున్నప్పటికీ, తెరాస మాత్రం దానిని సీరియస్ గానే తీసుకొంది. దానికి కౌంటర్ వ్యూహం రూపొందించుకొని సమర్ధంగా అమలుచేస్తూ దూసుకుపోతోంది. 

“16 ఎంపీ సీట్లు ఇస్తే డిల్లీలో చక్రం తిప్పుతామని, కేంద్రం మెడలు వంచి అన్ని సాధించుకొస్తామని, మన కేసీఆరే ప్రధానమంత్రి అయ్యే అవకాశం కూడా ఉందని తెరాస నేతలు చేస్తున్న వాదనలు ప్రజలను ఎంతగానో ఆకట్టుకొంటున్నాయి. 

అలాగే 16 ఎంపీ సీట్లు మనమే (తెరాస) గెలుచుకోబోతున్నామని వాదించడం కూడా ఒక వ్యూహమే. తెరాస నేతలు పదేపదే నమ్మకంగా, గట్టిగా నొక్కి చెపుతుండటంతో ప్రజలలో కూడా తెరాసయే గెలుస్తుందనే భావన ఏర్పడుతుంది. అది చాలు తెరాస గెలుపుకి! 

ఎన్నికల కోసం గొప్ప వ్యూహాలు రచించడమే కాకుండా వాటిని సమర్ధంగా అమలుచేయగలిగితేనే ఆశించిన ఫలితాలు వస్తాయని తెరాస అనేకసార్లు నిరూపించి చూపించింది. కానీ రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు ఇంత ముఖ్యమైన విషయాన్ని పట్టించుకోకుండా తమలో తాము కీచులాడుకొంటూ గుడ్డిగా ముందుకుసాగుతూ బోర్లాపడుతున్నారు. లోక్‌సభ ఎన్నికలలో కూడా మళ్ళీ బోర్లాపడే సూచనలు కనిపిస్తున్నాయి.


Related Post