కోమటిరెడ్డి సోదరులు తెరాసలో వెళ్లాలనుకొన్నారా?

March 25, 2019


img

నల్గొండ జిల్లాలోని ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆదివారం భువనగిరిలో మీడియాతో మాట్లాడుతూ, “అసెంబ్లీ ఎన్నికలలో నా ఓటమికి కోమటిరెడ్డి సోదరులే కారణం.  వారి కారణంగా నేను 2014,18 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఓడిపోయాను. నాకు వ్యతిరేకంగా వారు కొందరు స్వతంత్ర అభ్యర్ధులను బరిలో దింపి నా ఓటమికి కారకులయ్యారు. ఒకే పార్టీలో ఉంటూ ఈవిధంగా పార్టీ అభ్యర్ధిని ఓడించడానికి కుట్రలు చేయడం చాలా దారుణం. అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా వారువురూ తెరాసలో చేరేందుకు ప్రయత్నించారు కానీ తెరాస అధిష్టానం వారిని పార్టీలో చేర్చుకోవడానికి అంగీకరించకపోవడంతో భువనగిరి లోక్‌సభ స్థానం గెలుస్తామని కాంగ్రెస్‌ అధిష్టానానికి నమ్మబలికి టికెట్ సంపాదించుకొన్నారు. భువనగిరిలో మధుయాష్కీకి మంచి బలముంది. కనుక ఆయానకు లేదా ఎవరైనా బలమైన బీసీ అభ్యర్ధికి టికెట్ ఇవ్వాలని మేము కాంగ్రెస్‌ పెద్దలను కోరినప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి పట్టుబట్టి ఆ టికెట్ సంపాదించుకొన్నారు. టికెట్ల పంపిణీలో సిఎం కేసీఆర్‌ సామాజికన్యాయం పాటిస్తూ భువనగిరిలో బీసీ అభ్యర్ధి (బూర నర్సయ్య గౌడ్‌)కి టికెట్ కేటాయించారు. కేసీఆర్‌ మాత్రమే బీసీలకు న్యాయం చేస్తారని, ఆయన నాయకత్వంలోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని భావిస్తున్నాను. అందుకే త్వరలో తెరాసలో చేరబోతున్నాను,” అని తెలిపారు. 

పిసిసి అధ్యక్ష పదవిని ఆశించిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కొన్ని నెలల క్రితం ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఆ పదవిలో నుంచి తొలగించి తనకు అవకాశం ఇవ్వాలని లేకుంటే వేరే దారి (?) చూసుకొంటామని హెచ్చరించారు. ఆయన తెరాసలో చేరేందుకు తమను సంప్రదించారని కేటీఆర్‌ కూడా చెప్పారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలోనే అందరూ పనిచేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం గట్టిగా ఆదేశించడం, మరోవైపు వారిని పార్టీలో చేర్చుకొనేందుకు తెరాస అధిష్టానం ఆసక్తి చూపకపోవడంతో కోమటిరెడ్డి సోదరులు వెనక్కు తగ్గారు. ఆ తరువాత కధ అందరికీ తెలిసిందే. కానీ అసెంబ్లీ ఎన్నికల తరువాత కోమటిరెడ్డి సోదరులు మళ్ళీ తెరాసలోకి వెళ్ళేందుకు ప్రయత్నించారనేదే కొత్త విషయం. ఇది నిజమో కాదో కోమటిరెడ్డి సోదరులే చెప్పాలి.    



Related Post