కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లోక్‌సభ సీటుకు గాయత్రి రవిని అభ్యర్ధిగా ప్రకటించినప్పటికీ ఆయన స్థానంలో రేణుకా చౌదరిని బరిలో దింపాలని నిశ్చయించింది. రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ కు ఎంతో కీలకమైన ఈ లోక్‌సభ ఎన్నికలలో రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుచుకోవలసి ఉంటుంది కనుక ప్రతీ ఒక్క స్థానం కూడా చాలా కీలకంగా మారింది. పైగా ఖమ్మంలో మంచి బలమున్న నామా నాగేశ్వరరావును తెరాస బరిలో దింపింది. ఆయనకు తుమ్మల, అజయ్ పువ్వాడ తదితర తెరాస నేతలందరూ సహకరించడానికి అంగీకరించారు. కనుక ఆయనను డ్డీకొనేందుకు ఖమ్మం జిల్లా రాజకీయాలపై మంచిపట్టున్న రేణుకా చౌదరి సరైన అభ్యర్ధిగా భావించి ఆమెను కాంగ్రెస్ పార్టీ బరిలో దించుతోంది. ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరి ఖమ్మం నుంచి పోటీ చేస్తారనుకొన్నప్పటికీ ఆయన తెరాసలోనే కొనసాగుతానని ప్రకటించడంతో ఆ కధ ముగిసిపోయినట్లే. ఖమ్మం జిల్లాపై మంచి పట్టున్నకారణంగా టిడిపి కూడా పోటీ చేయాలనుకొన్నప్పటికీ, పార్టీ అధిష్టానం ఆదేశం మేరకు జిల్లా టిడిపి నేతలు రేణుకా చౌదరికి మద్దతు ప్రకటించారు. ఖమ్మం నుంచి బిజెపి అభ్యర్ధిగా వాసుదేవరావు పోటీ చేస్తున్నారు.