పోటీ తెరాసతోనే...కాంగ్రెస్‌తో కాదు: సాంబమూర్తి

March 23, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో పోటీ రాహుల్ గాంధీ, నరేంద్రమోడీల మద్యన లేదా కాంగ్రెస్‌, బిజెపిల మద్యనే ఉంటుందని, ఈ ఎన్నికలతో తెరాసకు ఎటువంటి సంబందమూ లేదని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు వాదిస్తుంటే, బిజెపి వరంగల్ లోక్‌సభ అభ్యర్ధి చింత సాంబమూర్తి పోటీ బిజెపి-తెరాసల మద్యనే ఉంటుందని వాదిస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌, బిజెపిలు రెండూ తెరాసతోనే పోటీ పడుతున్నాయనే సంగతి అందరికీ తెలుసు. తెరాస, కాంగ్రెస్‌ అభ్యర్ధులతో పోలిస్తే బిజెపిలో ఒకరిద్దరు తప్ప అందరూ బలహీనంగానే ఉన్నట్లు అర్ధం అవుతుంది. కనుక పోటీ ప్రధానంగా కాంగ్రెస్‌-తెరాసల మద్యనే సాగబోతోందని చెప్పవచ్చు. అయితే కొన్ని రాష్ట్రాలలో కాంగ్రెస్‌, బిజెపిలు ప్రాంతీయ పార్టీలతోనే పోరాడవలసి వస్తునప్పటికీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి మరికొన్ని రాష్ట్రాలలో మాత్రం బిజెపి అభ్యర్ధి సాంబమూర్తి చెప్పినట్లుగా పోటీ కాంగ్రెస్‌-బిజెపిల మద్యనే ఉండబోతోంది.       

సాంబమూర్తి హన్మకొండలో నిన్న మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌, తెరాసలపై కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. “కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే దేశంలో చాలాచోట్ల కనుమరుగయిపోయింది. ఈ ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌ పరిస్థితి మరింత దిగజారినా ఆశ్చర్యం లేదు. ఒకవేళ కాంగ్రెస్‌ లేదా కేసీఆర్‌ ఏర్పాటు చేస్తున్న కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే ప్రతీ ఆరు నెలలకు ఓ కొత్త ప్రధానమంత్రి వస్తుంటారు. నరేంద్రమోడీ నాయకత్వంలో దేశం అన్ని రంగాలలో అభివృద్ధి  చెందడమే కాకుండా పొరుగుదేశం కుట్రలను, దాడులను బలంగా తిప్పికొడుతోంది. కనుక దేశానికి సుస్థిరమైన, బలమైన ప్రభుత్వం ఉండాలంటే మళ్ళీ బిజెపినే గెలిపించి నరేంద్రమోడీని ప్రధానమంత్రిగా చేసుకోవాలి,” అని అన్నారు. 


Related Post