కేసీఆర్‌ నాగొంతు కోస్తారనుకోలేదు: వివేక్

March 23, 2019


img

లోక్‌సభ ఎన్నికలలో పెద్దపల్లి నుంచి టికెట్ ఆశించి భంగపడిన జి.వివేక్ సిఎం కేసీఆర్‌ తనను మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, “కేసీఆర్‌ నన్ను పక్కనే కూర్చొబెట్టుకొని నా గొంతుకోస్తారనుకోలేదు. పెద్దపల్లి నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు టికెట్ ఇస్తానని హామీ ఇచ్చి నన్ను పార్టీలో చేర్చుకొన్నారు. నేనేనాడూ టికెట్ ఇవ్వాలని పట్టుబట్టలేదు కానీ ఆయనే ఈసారి నాకు తప్పకుండా టికెట్ ఇస్తానని చాలాసార్లు చెప్పారు. కానీ చివరి నిమిషంలో నన్ను పక్కన పెట్టి నా గొంతు కోశారు. అందుకే నా పదవికి రాజీనామా చేశాను. పదవులు నాకు లెక్కకాదు. పదవులలో ఉన్నా లేకున్నా నేను పెద్దపల్లి ప్రజల మద్యనే ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుంటాను. నా అనుచరులతో మాట్లాడి నా భవిష్య కార్యాచరణను నిర్ణయించుకొంటాను. ఇప్పుడు నాకు బానిస సంకెళ్ళు తెంచుకొన్నట్లు హాయిగా అనిపిస్తోంది," అని అన్నారు. 

పదవుల మీద ఆశ, మమకారం లేవంటూనే 5 ఏళ్ళ పాటు ప్రభుత్వ సలహాదారు పదవిలో కొనసాగారు. ఇప్పుడు లోక్‌సభ టికెట్ ఇవ్వకుండా నా గొంతు కోశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 5 ఏళ్లుగా తెరాసలో ఉన్నప్పుడు, వివేక్ చేతులకు సంకెళ్ళు ఉన్నట్లు భావించలేదు. అలాగే ఏనాడూ కెసిఆర్ లో ఆయనకు ఏ లోపం కనబడలేదు. కానీ ఇప్పుడు టికెట్ ఇవ్వకపోయేసరికి కేసిఆర్ నమ్మకద్రోహి అయిపోయారు. అంటే పదవులతోనే ఎదుట వ్యక్తులను కొలిచి బేరీజు వేస్తారనుకోవాలేమో? 


Related Post