ఇంతకీ ఎంతమందిని గెలిపించాలి 16...17?

March 22, 2019


img

తెరాస 16 లోక్‌సభ స్థానాలకు పోటీ చేయబోతోందని కనుక తమ 16 మంది అభ్యర్ధులను తప్పక గెలిపించినట్లయితే డిల్లీలో చక్రం తిప్పుతామని అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయం నుంచే తెరాస పాట పాడుతుండటం అందరికీ తెలిసిందే. 17వ స్థానం (హైదరాబాద్‌) మిత్రపక్షమైన మజ్లీస్ పార్టీ పోటీ చేస్తుందని తెరాస నేతలే స్వయంగా చెప్పారు. కనుక తెరాసకు 16 ఎంపీ సీట్లు ఇవ్వాలని ప్రతీసభలో ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు. 

కానీ నిన్న విడుదల చేసిన జాబితాలో 17 స్థానాలకు తెరాస అభ్యర్ధులను ప్రకటించింది. మజ్లీస్ అభ్యర్ధి అసదుద్దీన్ ఓవైసీ పోటీ చేస్తున్న హైదరాబాద్‌ స్థానానికి పుస్తె శ్రీకాంత్‌ ను తెరాస అభ్యర్ధిగా ప్రకటించింది. అతను ‘డమ్మీ అభ్యర్ధి’ అని బహిరంగంగా చెప్పుకోలేదు కనుక తెరాస-మజ్లీస్ మద్య స్నేహపూర్వకమైన పోటీ అని సర్ధిచెప్పుకోవచ్చు. 

స్నేహపూర్వకపోటీ అయినప్పటికీ 17స్థానాలకు అభ్యర్ధులను నిలబెట్టింది కనుక ఇప్పుడు కూడా తెరాసకు 16 ఎంపీ సీట్లు ‘మాత్రమే’ ఇవ్వాలని కోరినట్లయితే అతను డమ్మీ అభ్యర్ధి అని స్వయంగా దృవీకరించినట్లవుతుంది. అలా వద్దనుకొంటే 17 ఎంపీ సీట్లను ఇవ్వమని తెరాస ప్రజలను కోరవలసి ఉంటుంది. అలా కోరితే మజ్లీస్ పార్టీని ఓడించమని తెరాస ప్రజలను కోరుతున్నట్లే భావించవచ్చు. అందుకు హైదరాబాద్‌ ప్రజలు కూడా సిద్దపడితే మజ్లీస్ పార్టీకి నష్టం కలుగుతుంది. కనుక ఇప్పుడు తెరాస 16 సీట్లు ఇవ్వాలని కోరినా లేదా 17 ఎంపీ సీట్లు ఇవ్వాలని ప్రజలను కోరినా ప్రతిపక్షాలకు తెరాసను వేలెత్తి చూపే అవకాశం లభిస్తుంది. 


Related Post