తెలంగాణలో కూడా ఏపీ, తమిళనాడు ఫార్ములా అమలు?

March 22, 2019


img

ఇప్పటి వరకు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, నేతలు తెరాసలోకి వెళుతున్నారు ఒకరో ఇద్దరో తెరాస నేతలు కాంగ్రెస్‌లోకి వెళుతున్నారు తప్ప రెండు పార్టీలు బిజెపివైపు చూడటం లేదు. కానీ మొన్న అర్దరాత్రి సీనియర్ కాంగ్రెస్‌ నేత డికె అరుణ హటాత్తుగా బిజెపిలో చేరి మహబూబ్‌నగర్‌ లోక్‌సభ టికెట్ సంపాదించున్నారు. ఊహించని ఈ పరిణామానికి కాంగ్రెస్‌లో కలవరం మొదలైంది.

అయితే డికె అరుణ ఒక్కరే బిజెపిలోకి వెళ్ళారనుకొంటే పొరపాటేనని తెలుస్తోంది. త్వరలో మరో 5-6 మంది సీనియర్ కాంగ్రెస్‌ నేతలను బిజెపిలోకి రప్పించేందుకు ఆ పార్టీ కార్యదర్శి రాంమాధవ్ తెరవెనుక చర్చలు సాగిస్తున్నారని తాజా సమాచారం. ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీలో పనిచేసి బిజెపిలోకి మారిన ఏపీ బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, తెలంగాణలోని కాంగ్రెస్‌ నేతలతో తనకున్న పాత పరిచయాలతో వారితో మంతనాలు జరిపి చర్చలు ఒక కొలిక్కి వచ్చిన తరువాత, పార్టీ తరపున వారికి అవసరమైన హామీలు ఇచ్చి వారిని బిజెపిలోకి రప్పించే బాధ్యత రాంమాధవ్ కు అప్పగిస్తున్నట్లు తెలుస్తోంది. 

ఏపీలో కాంగ్రెస్ పార్టీ, తమిళనాడులో అన్నాడిఎంకె పార్టీలు నిర్వీర్యం అయిన తరువాతే రెండు రాష్ట్రాలపై బిజెపి కొంత పట్టు సాధించగలిగింది. కనుక అదే ఫార్ములాను తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రయోగించి 2024 సార్వత్రిక ఎన్నికల నాటికి తెరాసకు ధీటుగా నిలబడాలనేది బిజెపి వ్యూహామని ప్రముఖ ఇంగ్లీషు దినపత్రిక ‘ది హిందూ’ ప్రత్యేక కధనంలో పేర్కొంది. ముందుగా రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీని ఫిరాయింపుల ద్వారా తుడిచిపెట్టేయగలిగితే, ఆ తరువాత తెరాసకు ప్రత్యామ్నాయంగా ఎదిగే అవకాశం ఉంటుందని బిజెపి భావిస్తునట్లు ఆ పత్రిక పేర్కొంది. బిజెపిలో చేరిన తరువాత డికె అరుణ చెప్పింది కూడా అదే. ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్‌లో 5-6 మంది సీనియర్ కాంగ్రెస్‌ నేతలు ఏ నిమిషంలోనైనా బిజెపిలో చేరిపోయి  కాషాయ కండువాలు కప్పుకోవచ్చునని తెలుస్తోంది. వారిలో సర్వే సత్యనారాయణ కూడా ఒకరని సమాచారం.     

ఇప్పటికే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ఫిరాయింపులతో కుదేలైపోయిన కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు బిజెపి కూడా టార్గెట్ చేయడంతో ఏమి చేయాలో తెలియక కాంగ్రెస్‌ నేతలు తలలు పట్టుకొంటున్నారు. ఆంధ్రా, తమిళనాడు రాష్ట్రాలలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల చూసినట్లయితే తెర వెనుక బిజెపి చేస్తున్న ఈ ప్రయత్నాలు కాంగ్రెస్ పార్టీకే కాదు... తెరాసకు కూడా ఆందోళన కలిగించేవేనని చెప్పవచ్చు. ఎందుకంటే బిజెపి నెక్స్ట్ టార్గెట్ తెరాస అవుతుంది కనుక. కానీ అటువంటి పరిస్థితే వస్తుందని తెరాసకు ఏమాత్రం అనుమానం కలిగినా బిజెపిపై కూడా ఆపరేషన్ ఆకర్ష ప్రయోగించకుండా ఊరుకోదని ఖచ్చితంగా చెప్పవచ్చు. 

కేసీఆర్‌ ఫెడరల్‌ ఫ్రంట్‌ లేదా జాతీయపార్టీ స్థాపించి నరేంద్రమోడీని గద్దె దించి ఆ కుర్చీలో తాను కూర్చోవాలని ప్రయత్నాలు చేస్తుంటే, తెరాసను గద్దె దించి రాష్ట్రంలో అధికారం చేజిక్కించుకోవాలని బిజెపి తెర వెనుక ప్రయత్నాలు చేస్తుండటం విశేషం. 


Related Post