దానికి సమాధానం నాకు తెలీదు: జితేందర్ రెడ్డి

March 22, 2019


img

ఊహించినట్లుగానే సిఎం కేసీఆర్‌ నిన్న విడుదల చేసిన లోక్‌సభ అభ్యర్ధుల జాబితాలో తెరాస ఎంపీ జితేందర్ రెడ్డి పేరు లేదు. ఆయనకు బదులు ఈసారి మన్నే శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చారు. 

తనకు టికెట్ ఇవ్వకపోవడంపై జితేందర్ రెడ్డి స్పందిస్తూ, “ఈసారి నాకు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అనే ప్రశ్నకు నా వద్ద సమాధానం లేదు. నేను పార్టీ కోసం, నా నియోజకవర్గం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం చాలా చిత్తశుద్ధితో పనిచేశాను. నా రాజకీయజీవితంలో ఎటువంటి మచ్చ లేదు. బహుశః అందుకే ఎవరికో ఈర్ష్యపుట్టి నాపై మచ్చవేసి నా సీటును తీసుకొని ఉండవచ్చు. అయితే సిఎం కేసీఆర్‌ నన్ను సొంత తమ్ముడిలా చూసుకొన్నారు. లోక్‌సభలో తెరాసపక్షనేతగా అవకాశం కల్పించారు. పార్టీ సమావేశాలలో నాకు సముచిత గౌరవం కల్పించేవారు. కనుక ఆయన నా గురించి మంచి ఆలోచనతోనే పక్కన పెట్టి ఉంటారని భావిస్తున్నాను. టికెట్ ఇవ్వనప్పటికీ నేను తెరాసలోనే కొనసాగుతాను. పార్టీ మారుతానని మీడియాలో వస్తున్న ఊహాగానాలన్నీ అబద్దమే. ఇక నుంచి నేను నా నియోజకవర్గంలో ప్రజల మద్య ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంటాను. పదవులు వస్తుంటాయి...పోతుంటాయి. అంతమాత్రన్న చింతించనవసరం లేదు. సిఎం కేసీఆర్‌పై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఆయన చెప్పినట్లే నడుచుకొంటాను,” అని అన్నారు. 

జితేందర్ రెడ్డి చాలా హుందాగా స్పందించారని అర్ధమవుతూనే ఉంది. అయితే ఆయన ఇదే వైఖరితో ఓపికగా ఎదురుచూడగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది. కాదని తనపై ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలపై ప్రతీకారధోరణితో వ్యవహరిస్తే కేసీఆర్‌ ఆగ్రహానికి గురయ్యే ప్రమాదం ఉంటుంది. అప్పుడు రాజకీయ భవిష్యత్ కూడా అగమ్యగోచరంగా మారుతుంది. కనుక జితేందర్ రెడ్డి కొంతకాలం సంయమనం పాటించడమే మంచిది.


Related Post