పార్టీలో గౌరవం లభించలేదు అందుకే బై! డికె అరుణ

March 20, 2019


img

సీనియర్ కాంగ్రెస్‌ నేత డికె అరుణ మంగళవారం రాత్రి డిల్లీలో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమక్షంలో ఆ పార్టీలో చేరారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ పార్టీలో నాకు సరైన గౌరవం లభించలేదు. అందుకే నేను పార్టీ వీడవలసివచ్చింది. అసెంబ్లీ ఎన్నికల విషయంలో నేను కాంగ్రెస్ అధిష్టానానికి, రాష్ట్ర కాంగ్రెస్‌ పెద్దలకు కూడా అనేక సూచనలు చేశాను కానీ నా మాటలను ఎవరూ పట్టించుకోలేదు. అసెంబ్లీ ఎన్నికలలో తెరాసను ఓడించి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే గొప్ప అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకొన్నాము. రాష్ట్రంలో.. జాతీయస్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ క్రమంగా తన ఉనికిని కోల్పోతోంది. ఈ పరిస్థితులలో రాష్ట్రంలో తెరాసకు ఏకైక ప్రత్యామ్నాయంగా బిజెపి మాత్రమే నిలువగలదని భావిస్తున్నాను. కేవలం ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుంది. కనుక నరేంద్రమోడీ మళ్ళీ ప్రధానమంత్రి కావలసిన అవసరం ఉంది,” అని అన్నారు.  

తనను కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదని డికె అరుణ చెప్పడం చాలా తప్పని చెప్పక చెప్పక తప్పదు. ఆమె సమర్ధతను గుర్తించే గతంలో మంత్రి పదవి ఇచ్చి గౌరవించింది. పార్టీలో సీనియర్ నేత కనుక ఆమె అడగకుండానే ప్రతీ ఎన్నికలలో టికెట్లు, వివిద కమిటీలలో పదవులు ఇచ్చి గౌరవించింది. లోక్‌సభ ఎన్నికలలో కూడా ఆమెకు కీలకమైన కాంగ్రెస్‌ ఎన్నికల ప్రచార కమిటీ బాధ్యతలు అప్పగించింది. ఆమె సమర్దురాలని కాంగ్రెస్ పార్టీ గుర్తించబట్టే పార్టీలో అంత ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు తనకు పార్టీలో గౌరవం లభించలేదని డికె అరుణ చెప్పడం హాస్యాస్పదంగా ఉంది. ఆమె పిసిసి అధ్యక్ష పదవిని ఆశించి అది దక్కకపోవడంతోనే పార్టీని వీడి వెళ్ళినట్లు కాంగ్రెస్‌ వర్గాలు చెపుతున్నాయి.


Related Post