టిడిపికి నామం...తెరాస..కాంగ్రెస్‌ దేనిలోకి జంప్?

March 20, 2019


img

టిడిపి పొలిటీ బ్యూరో సభ్యుడు నామా నాగేశ్వరరావు మంగళవారం తన పదవికి, టిడిపికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన టిడిపి అధినేత చంద్రబాబునాయుడుకు ఒక బహిరంగ లేఖ వ్రాశారు. దానిలో ‘తెలంగాణ రాష్ట్రంలో టిడిపికి పూర్వ వైభవం సాధించేందుకు తీవ్రంగా కృషి చేసినప్పటికీ మనుగడ కష్టంగా మారింది. రాష్ట్రంలో ప్రజలు తెరాసపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. కనుక వారి ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవడం నా బాధ్యత. కనుక టిడిపిలో నా ప్రాధమిక సభ్యత్వానికి, నా పొలిట్ బ్యూరో పదవికి రాజీనామా చేస్తున్నాను,’ పేర్కొన్నారు. 

నామా నాగేశ్వరరావుకు ఖమ్మం నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకొంటున్నారు. ప్రస్తుతం ఆయన కాంగ్రెస్‌, తెరాస రెండు పార్టీలతో టికెట్ కోసం మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకే రెండు పార్టీలు ఇంతవరకు ఖమ్మం అభ్యర్ధిని ప్రకటించకుండా పెండింగులో ఉంచాయి. ఆయన అధికార తెరాసలో చేరేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. కానీ తెరాసలో ఖమ్మం లోక్‌సభ సీటుకు సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా పోటీ పడుతున్నారు. కనుక తెరాసలో టికెట్ లభిస్తుందో లేదో తెలియదు. తెరాస లోక్‌సభ అభ్యర్ధుల జాబితాను గురువారం ప్రకటిస్తానని సిఎం కేసీఆర్‌ నిన్న ప్రకటించినందున ఖమ్మం లోక్‌సభ సీటు పొంగులేటి, నామాలలో ఎవరికి లభిస్తుందో స్పష్టం అవుతుంది. ఒకవేళ పొంగులేటికే కేటాయిస్తే నామా కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేయవచ్చు. ఏ పార్టీలో చేరితే ఆ పార్టీ పల్లవి ఆలపిస్తారు. 


Related Post