పవన్‌కల్యాణ్‌ ఆలోచన మంచిదే కానీ...

March 16, 2019


img

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ హటాత్తుగా శుక్రవారం లక్నో వెళ్ళి అక్కడ బీఎస్పీ అధినేత్రి మాయావతితో సమావేశమయ్యి అందరినీ ఆశ్చర్యపరిచారు. త్వరలో జరుగబోయే ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలలో ఆ పార్టీతో పొత్తులు పెట్టుకొనే ఉద్దేశ్యంతో పవన్‌కల్యాణ్‌ లక్నో వెళ్ళి ఆమెను కలిశారు. 

సమావేశం అనంతరం పవన్‌కల్యాణ్‌ మీడియాతో మాట్లాడుతూ, “త్వరలో జరుగబోయే ఎన్నికలలో జనసేన, బీఎస్పీ పార్టీలు కలిసి రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీ చేస్తాయి. మాయావతి చాలా విజన్ ఉన్న నాయకురాలు. ఆమెకు ప్రధానమంత్రిగా చూడాలని కోరుకొంటున్నాను,” అని అన్నారు. 

మాయావతి మాట్లాడుతూ, “నేను కూడా పవన్‌కల్యాణ్‌ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి కావాలని కోరుకొంటున్నాను. ఎన్నికలలో మా రెండు పార్టీలు కలిసిపోటీ చేస్తాయి,” అని చెప్పారు. 

ఏపీలో బలమైన టిడిపి, వైసీపీల మద్య ఈసారి గట్టి పోటీ ఉండబోతోంది. వాటిని తట్టుకొని నిలబడాలంటే ఇటువంటి పొత్తులు చాలా అవసరమే. పవన్‌కల్యాణ్‌ ఇప్పటికే వామపక్షాలతో పొత్తులకు సిద్దమయ్యారు. ఇప్పుడు వెనుకబడిన తరగతులకు ప్రాతినిధ్యం వహిస్తున్న బీఎస్పీపీతో పొత్తులు పెట్టుకోవాలనుకోవడం రాజకీయంగా మంచి ఆలోచనే. కానీ అవినీతి ఆరోపణలలో సుప్రీంకోర్టు చేత కూడా మొట్టికాయలు వేయించుకొన్న మాయావతి ప్రధానమంత్రి కావాలని కోరుకోవడం తొందరపాటే అవుతుంది. లోక్‌సభ ఎన్నికల తరువాత ఏ కూటమి గెలుస్తుందో, దేనికి ఎన్ని సీట్లు వస్తాయో తెలియకుండా ప్రధానమంత్రి అభ్యర్ధి గురించి మాట్లాడటం తొందరపాటేనని చెప్పవచ్చు. కాంగ్రెస్‌, బిజెపిలకు ప్రత్యామ్నాయంగా ఫెడరల్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానని చెపుతున్న సిఎం కేసీఆర్‌ కూడా ఇప్పటి వరకు ప్రధానమంత్రి అభ్యర్ధి విషయంలో ఎన్నడూ నోరుజారకపోవడం గమనిస్తే ఈవిషయం అర్ధం అవుతుంది.


Related Post