మార్చి 15న తెలంగాణ బిజెపి అభ్యర్ధుల జాబితా

March 12, 2019


img

బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సోమవారం డిల్లీలో రాష్ట్ర ముఖ్య నేతలతో ఏప్రిల్ 11న తెలంగాణలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు అభ్యర్ధుల జాబితాపై సుదీర్గంగా చర్చించారు. ఆ సమావేశానికి రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎంపీ బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శులు మురళీధర్‌రావు, రాంమాధవ్‌, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి కృష్ణదాస్‌, సీనియర్ నేతలు జి.కిషన్‌రెడ్డి, శ్రీనివాసులు హాజరయ్యారు. 

కేంద్రంలో బిజెపి మళ్ళీ అధికారంలోకి రావాలంటే తెలంగాణలో ప్రతీ ఒక్క సీటు కీలకమైనదే కనుక రాష్ట్రంలో అత్యధిక ఎంపీ సీట్లను గెలుచుకొనేందుకు గెలుపు గుర్రాలపై సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ముఖ్యంగా బిజెపికి మంచి పట్టున్న మల్కాజ్‌గిరి, సికిందరాబాద్‌, నిజామాబాద్‌, అదిలాబాద్, మెదక్, మహబూబ్‌నగర్‌, కరీంనగర్‌, చేవెళ్ళ నియోజకవర్గాలపై ఎక్కువ దృష్టిపెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ నెల 18వ తేదీలోగా నామినేషన్లు దాఖలు చేయవలసి ఉంది కనుక మార్చి 15న లోక్‌సభకు పోటీ చేయబోయే అభ్యర్ధుల జాబితాను ప్రకటించవచ్చునని బండారు దత్తాత్రేయ తెలిపారు. 16 ఎంపీ సీట్లను గెలుచుకొంటామని తెరాస నేతల మాటలను ప్రజలను మభ్యపెట్టడానికి చేస్తున్న ఎన్నికల జిమ్మిక్కుగా కొట్టిపడేశారు. రాష్ట్రంలో 17 స్థానాలలో తమ పార్టీ పోటీ చేస్తుందని వాటిలో అత్యధిక స్థానాలను బిజెపి గెలుచుకొంటుందని బండారు దత్తాత్రేయ చెప్పారు. 

అసెంబ్లీ ఎన్నికలలో ఘోరపరాజయం పొందిన బిజెపికి రాష్ట్రంలో మళ్ళీ నిలద్రొక్కుకొనేందుకు ఈ లోక్‌సభ ఎన్నికలు  చివరి అవకాశంగా చెప్పవచ్చు. కనుక ఈ ఎన్నికలలో పార్టీని గెలిపించుకొనేందుకు ఈసారి రాష్ట్ర బిజెపి నేతలు గట్టిగానే కృషి చేయవచ్చు.


Related Post