ప్రధాని మోడీకి ఫరూక్ సూటి ప్రశ్న

March 11, 2019


img

కేంద్ర ఎన్నికల సంఘం జమ్ముకశ్మీర్‌లో కేవలం లోక్‌సభ ఎన్నికలకు మాత్రమే షెడ్యూల్ ప్రకటించి, అసెంబ్లీకి ప్రకటించకపోవడాన్ని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా తప్పు పట్టారు. “రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలు నిర్వహించగలిగినప్పుడు అసెంబ్లీ ఎన్నికలు ఎందుకు నిర్వహించడం లేదు? లోక్‌సభ ఎన్నికలకు రాష్ట్రంలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని ఎన్నికల సంఘం భావించినప్పుడు అసెంబ్లీ ఎన్నికలకు అనుకూలంగా లేవని ఎందుకు భావిస్తోంది? దీని వెనుక ఆంతర్యం ఏమిటి?” అని ప్రశ్నించారు. 

ఆ ప్రశ్నలకు జవాబులు ఫరూక్ అబ్దుల్లాకు కూడా బాగా తెలుసు. జమ్ముకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది రాష్ట్రంలో ఉగ్రవాదులను, వేర్పాటువాదులను కట్టడి చేయకపోగా వారికి అది తొత్తుగా మారిపోతోంది. ఆ కారణంగా జమ్ముకశ్మీర్‌లో నానాటికీ పరిస్థితులు దిగజారిపోతున్నాయి. అందుకే అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడం లేదని చెప్పవచ్చు. 

లోక్‌సభ ఎన్నికలు కేంద్రప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడానికి మాత్రమే జరుగుతున్నవి కనుక అవి జమ్ముకశ్మీర్‌ పరిపాలనపై ఎటువంటి ప్రభావం చూపవు కనుకనే లోక్‌సభ ఎన్నికలు నిర్వహిస్తున్నట్లు చెప్పవచ్చు. రాష్ట్రంలో శాంతిభద్రతలు నెలకొల్పడం ఆ రాష్ట్రంలో పార్టీలకు చేతకానప్పటికీ, ప్రభుత్వం ఏర్పడితే దాని ద్వారా పదవులు, అధికారం, విలాసవంతమైన జీవితం అనుభవించవచ్చుననే ఆరాటంతోనే ఎన్నికలు జరగాలని కోరుకొంటాయి. కానీ పుల్వామా ఉగ్రదాడి తరువాత సాయుధబలగాల సాయంతో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కశ్మీర్‌లో తిష్టవేసిన  వేర్పాటువాదులను ఏరివేస్తోంది. అది పూర్తయితే జమ్ముకశ్మీర్‌లో పరిస్థితులు మళ్ళీ సామాన్యస్థితికి వస్తాయి. అప్పుడు ఎన్నికలు నిర్వహించుకోవచ్చుననే ఉద్దేశ్యంతోనే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించడంలేదని భావించవచ్చు.


Related Post