15మంది ఎంపీలతో ఏం పీకారు? పొన్నం ప్రశ్న

March 07, 2019


img

తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలలో తెరాసకు 16 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి రాష్ట్రానికి అన్నీ సాధించుకోస్తామని గట్టిగా నొక్కి చెపుతున్నారు. దానిపై కాంగ్రెస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ తీవ్రంగా స్పందించారు. 

ఈరోజు గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ, “మీకున్న 15 మంది ఎంపీలతో ఏమి సాధించలేనప్పుడు మళ్ళీ 16 ఎంపీ సీట్లు ఇస్తే మాత్రం ఏమి సాధించగలరు? ఈ నాలుగున్నరేళ్ళలో విభజన హామీలలో ఒక్క దానినైనా మీరు సాధించగలిగారా?ఎందుకు సాధించలేకపోయారో చెప్పగలరా? అమరవీరుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్‌ యువరాజునన్నట్లు వ్యవహరిస్తూ నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను తెలంగాణ కోసం ఏమి చేశానో ఆయనకు తెలియకపోతే తన తండ్రి కేసీఆర్‌ను అడిగి తెలుసుకొంటే మంచిది. రాష్ట్ర విభజనను తీవ్రంగా వ్యతిరేకించిన సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మా పార్టీకి చెందిన వ్యక్తే అయినప్పటికీ, ఆయనను తెలంగాణ గడ్డపై అడుగుపెట్టనీయనని నేను గట్టిగా హెచ్చరిస్తుంటే, కేటీఆర్‌ వెళ్ళి అదే కిరణ్ కుమార్ రెడ్డితో పైరవీలు చేసుకొన్న మాట వాస్తవమా కాదా? ఒకప్పుడు నెలకు కేవలం లక్ష రూపాయాలు జీతం సంపాదించుకొనే మీకు రాజకీయాలలోకి వచ్చేక వేలకోట్లు ఏవిధంగా కూడబెట్టగలిగారో ప్రజలకు చెప్పగలరా?16 ఎంపీ సీట్లు అంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ మైండ్ గేమ్ ఆడుతున్నారు. కానీ వారి మాటలను ప్రజలు నమ్మబోరు,” అని పొన్నం ప్రభాకర్‌ తీవ్ర విమర్శలు చేశారు. 



Related Post