జయసుధ కూడా జంప్!

March 07, 2019


img

మన తెలుగు సినీతారలలో చాలామందే రాజకీయాలలోకి ప్రవేశించారు కానీ వారిలో ఒక్క విజయశాంతి తప్ప వేరేవరూ పెద్దగా రాణించలేదు. విజయశాంతి, జయప్రద వంటి తారలు రాజకీయాలలో తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోగలిగారు కానీ వారి స్థాయికి తగ్గట్లు రాజకీయాలలో ఉన్నత శిఖరాలకు ఎదగలేకపోయారని చెప్పకతప్పదు. వారి సాటి నటి జయసుధ కూడా మొదట కాంగ్రెస్ పార్టీలో ఆ తరువాత టిడిపిలో చేరినప్పటికీ పెద్దగా రాణించలేదు. రాజకీయాలలో ఇమడలేనని చెప్పి చాలా కాలంగా టిడిపికి దూరంగా ఉంటున్నారు. కానీ ఈరోజు హటాత్తుగా ఆమె హైదరాబాద్‌లో లోటస్ పాండ్ కు వెళ్ళి జగన్మోహన్ రెడ్డి సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

తరువాత ఆమె మీడియాతో మాట్లాడుతూ, “వైస్ కుటుంబంతో నాకున్న అనుబందం, అభిమానంతోనే నేను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాను. పార్టీలో చేరగానే మళ్ళీ సొంత ఇంటికి వచ్చిన అనుభూతి కలిగింది. ప్రస్తుతానికి నాకు ఎన్నికలలో పోటీ చేయాలనే ఉద్దేశ్యం లేదు. కానీ పార్టీ అధ్యక్షుడు ఎటువంటి బాధ్యత అప్పగించినా స్వీకరిస్తాను. త్వరలో జరుగనున్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలవడం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం తధ్యం అని నమ్ముతున్నాను,” అని అన్నారు. 

జయసుధ తనకు ఎన్నికలలో పోటీ చేసే ఉద్దేశ్యం లేదని చెప్పినప్పటికీ, ఆ ఉద్దేశ్యం ఉండబట్టే ఆమె ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారని భావించవచ్చు. లేకుంటే ఇదివరకు ఎప్పుడో లేదా ఎన్నికల తరువాతో వైసీపీలో చేరి ఉండేవారు. 

ఆమె గతంలో సికిందరాబాద్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలిచారు. ఆమెకు ఆంధ్రాప్రజలలో మంచి ఆధరణ అనుబందమే ఉంది కనుక ఈసారి ఆంధ్రాలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఉద్దేశ్యంతోనే నేడు వైసీపీలో చేరి ఉండవచ్చు.


Related Post