లోక్‌సభ ఎన్నికలకు మళ్ళీ ప్రజాకూటమి ఏర్పాటు

March 07, 2019


img

అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్‌ నేతృత్వంలో టిడిపి, టిజేఎస్‌, సిపిఐ పార్టీలు కలిసి ప్రజాకూటమిని ఏర్పాటు చేసుకొని పోటీ చేసి ఓడిపోయాయి. ఓటమి షాక్ నుంచి కాంగ్రెస్‌ పార్టీ త్వరగానే కోలుకొంది కానీ మిగిలిన మూడు పార్టీలు నేటికీ ఆ షాక్ నుంచి బయటపడినట్లు లేవు. అవి తేరుకోకమునుపే మళ్ళీ లోక్‌సభ ఎన్నికలు వచ్చేస్తున్నాయి. గత చేదు అనుభవం దృష్ట్యా ఈసారి ఆ నాలుగు పార్టీలు పొత్తుల ఆలోచన మళ్ళీ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీ ఒంటరిపోరాటానికి సిద్దం అవుతుండగా, సిపిఐ మళ్ళీ సిపిఎంకు దగ్గరవుతోంది.

అసెంబ్లీ ఎన్నికలలో సిపిఎం నేతృత్వంలో 28 పార్టీలతో కలిసి కూటమి (బిఎల్ఎఫ్) ప్రయోగం చేసి విఫలమైనప్పటికీ, ఈసారి లోక్‌సభ ఎన్నికలలో సిపిఐ, టిజేఎస్‌, జనసేనలను కూడా కలుపుకొని ప్రజాకూటమిని ఏర్పాటు చేసుకోవడానికి సిపిఎం సిద్దం అవుతోంది. దీనికోసం సిపిఐ, సిపిఎం నేతల మద్య  ఇప్పటికే కొన్నిసార్లు సమావేశాలు జరిగాయి. బుదవారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణ కేంద్రంలోని సిపిఎం కార్యాలయంలో ఇరుపక్షాల నేతలు మరోసారి సమావేశమయ్యి  టిజేఎస్‌, జనసేన వంటి భావస్వారూప్యత కలిగిన పార్టీలను కలుపుకొని ప్రజాకూటమి పేరిట లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించారు.

కాంగ్రెస్‌, బిజెపి, తెరాసలు మూడూ ప్రజల ఆకాంక్షల మేరకు పాలన అందించడంలో విఫలమయ్యాయని, కేవలం వామపక్షాలు మాత్రమే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా పాలన అందించగలవని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. 

ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో పోరాడటంలో వామపక్షాలు ఎప్పుడూ ముందే ఉంటాయి. కానీ ఇంతవరకు ఒక్కసారి కూడా రాష్ట్రంలో అధికారంలోకి రాలేకపోయాయి. కనీసం గౌరవప్రదమైన సీట్లు గెలుచుకోలేకపోయాయి. అయినప్పటికీ వాటి పోరాటస్పూర్తి ఏమాత్రం తగ్గలేదు. అందుకు ఆ పార్టీలను అభినందించవలసిందే. కానీ అసెంబ్లీ ఎన్నికలలో చతికిలపడిన వామపక్షాలు లోక్‌సభ ఎన్నికలలో చేతులు కలిపినంత మాత్రన్న గెలుస్తాయనుకోవడం అత్యాశే అవుతుందని చెప్పవచ్చు.


Related Post