కేసీఆర్‌కు అమిత్ షా సవాల్

March 07, 2019


img

 లోక్‌సభ ఎన్నికల సన్నాహాలలో భాగంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుదవారం నిజామాబాద్‌లో బిజెపి సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ నియోజకవర్గాలను నాలుగు భాగాలుగా విభజించుకొని, ఒక్కో సమావేశంలో ఒక్కో భాగంలోని నియోజకవర్గాలపై సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా బుదవారం జరిగిన సమావేశంలో నిజామాబాద్‌, అదిలాబాద్, కరీంనగర్‌, జహీరాబాద్, మెదక్ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన నేతలతో అమిత్ షా సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ, “పూర్తి మెజారిటీతో రాష్ట్రంలో రెండవసారి అధికారంలోకి వచ్చినప్పటికీ సిఎం కేసీఆర్‌ మజ్లీస్ పార్టీకి భయపడుతుండటం ఆశ్చర్యంగా ఉంది. తెరాస, మజ్లీస్ పార్టీలు కలిసి 16+1 లోక్‌సభ స్థానాలు గెలుచుకోబోతున్నాయంటూ రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. రజాకార్ల పార్టీతో దోస్తీ కోసం కేసీఆర్‌ ఒక ఎంపీ సీటును త్యాగం చేయడం హాస్యాస్పదంగా ఉంది. దేశంలో ఎక్కడ ఉగ్రవాదం బయటపడినా దాని మూలాలు హైదరాబాద్‌, ముంబై, అహ్మదాబాద్‌ నగరాలలోనే ఉంటున్నాయి. అటువంటి ఆసాంఘీకశక్తులను ఏరిపారేయడానికి సిఎం కేసీఆర్‌ సిద్దామేనా?అని సిఎం కేసీఆర్‌ను ప్రశ్నిస్తే జవాబు లభించదు. గతంలో ఉగ్రదాడులు జరిగినప్పుడు అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈవిధంగా బలంగా శత్రువులను తిప్పికొట్టలేకపోయింది. లోక్‌సభ ఎన్నికలు ప్రధానమంత్రిని ఎన్నుకొనేందుకు జరుగుతున్నవే తప్ప ముఖ్యమంత్రిని ఎన్నుకోవడానికి కాదు. కనుక తెలంగాణ ప్రజలకు నా విజ్ఞప్తి ఏమిటంటే కేంద్రంలో అవినీతిరహితమైన, సుస్థిరమైన బలమైన ప్రభుత్వం ఏర్పడాలంటే బిజెపికే ఓటు వేసి గెలిపించాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు. 


Related Post