టిడిపి మరోసారి ఫిక్స్ అయిందా?

March 06, 2019


img

ఓటుకు నోటు కేసుతో చిక్కులో పడిన తెలుగుదేశం పార్టీ డేటా చోరీ కేసులో చిక్కుకొన్నట్లే కనిపిస్తోంది. ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు జరిపి దోషులను పట్టుకొనేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ కేసును ప్రత్యేక దర్యాప్తు బృందం (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం)కు అప్పగించింది. 

హైదరాబాద్‌ వెస్ట్ జోన్ ఐజి స్టీఫెన్ రవీంద్రన్ నేతృత్వంలో ఏర్పాటుచేయబడిన ఈ సిట్ బృందంలో సైబర్ క్రైమ్ డీసీపీ రోహిణి, కామారెడ్డి ఎస్పీ శ్వేతారెడ్డి, డీఎస్పీ రవి కుమార్, ఏసీపి శ్రీనివాస్ మరో ఇద్దరు సబ్-ఇన్స్పెక్టర్లు ఉన్నారు. వీరికి తెలంగాణ డిజిపి కార్యాలయంలో ప్రత్యేక ఛాంబర్ ను కేటాయించినట్లు తెలుస్తోంది.

సిట్ ఏర్పాటుతో టీడీపి పీకల్లోతు కష్టాలలో కూరుకుపోయే సూచనలు కనిపిస్తున్నాయి. “టిడిపి ఏ నేరం చేయలేదని భావిస్తున్నట్లయితే, ప్రధాన ముద్దాయి అశోక్ ఎందుకు అ జ్ఞాతంలోకి వెళ్ళిపోయారు? ఆయన ఏ తప్పు చేయనట్లయితే తెలంగాణ పోలీసులకు ఎందుకు లొంగిపోవడం లేదు? తెలంగాణ పోలీసులు ఆయనను అరెస్ట్ చేయకుండా ఏపీ టిడిపి నేతలు ఎందుకు కాపాడుతున్నారు? టిడిపి నేతలు కోర్టులో తమ నిజాయితీని నిరూపించుకొనే ప్రయత్నం చేయకుండా ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకొనేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నారు?” అనే కేటీఆర్‌ ప్రశ్నలకు టిడిపి నేతలు సూటిగా సమాధానం చెప్పలేకపోతున్నారు. ఆ కారణంగా టిడిపిపై ఇంకా అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ కేసు ఎప్పుడు ఏవిధంగా ముగుస్తుందో తెలియదు కానీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి తీరని నష్టం కలిగించే ప్రమాదం కనిపిస్తోంది.


Related Post