దేవగౌడతో రాహుల్ భేటీ

March 06, 2019


img

కర్ణాటకలో కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వం నడుపుతున్న సంగతి తెలిసిందే. కనుక లోక్‌సభ ఎన్నికలలో కూడా కలిసి పోటీచేయాలనుకోవడం సహజమే. కర్ణాటకలో ఇరుపార్టీలు సీట్ల సర్ధుబాట్లపై చర్చించేందుకు రాహుల్ గాంధీ ఈరోజు ఉదయం డిల్లీలో దేవగౌడ నివాసానికి వెళ్లారు. కర్ణాటకలో మొత్తం 28 ఎంపీ స్థానాలున్నాయి. వాటిలో కనీసం 12 స్థానాలలో జెడిఎస్ పోటీ చేయాలనుకొంటోంది. కానీ వాటిలో నలుగురు సిట్టింగ్ కాంగ్రెస్‌ ఎంపీలున్నారు. కనుక వాటిని వదులుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఇష్టపడటం లేదు. ఈరోజు రాహుల్ గాంధీ-దేవగౌడ సమావేశంలో ఆ నాలుగు సీట్ల సర్దుబాట్లపై అంగీకారం కుదిరితే రెండు పార్టీలు వెంటనే అభ్యర్ధులను ప్రకటించదానికి సిద్దంగా ఉన్నాయి.

గత ఏడాది జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో బిజెపి అతిపెద్ద పార్టీగా అవతరించి, అధికారం దక్కించుకొన్నప్పటికీ, అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోలేక 48 గంటలలోనే ఎడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది. అప్పటి నుంచి కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీలపై ఆయన ప్రతీకరేచ్చతో రగిలిపోతున్నారు. లోక్‌సభ ఎన్నికలలో వాటిని చిత్తుగా ఓడించి ప్రతీకారం తీర్చుకోవాలని తహతహలాడుతున్నారు. కనుక ఈసారి బిజెపి నుంచి ఆ రెండు పార్టీలకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం ఉంది.

కాంగ్రెస్‌, జెడిఎస్ పార్టీలు బిజెపిని ఓడించి విజయం సాధించగలిగితే, ఆ తరువాత మిత్రపక్షమైన జెడిఎస్ నుంచే రాహుల్ గాంధీకి సవాలు ఎదురవనుంది. ఒకవేళ కాంగ్రెస్ మిత్రపక్షాలకు కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం వస్తే ఈసారి కర్ణాటకకు చెందిన వ్యక్తి (దేవగౌడ) దేశప్రధాని అవుతారని కొన్ని రోజుల క్రితమే కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రకటించారు.

అది కర్ణాటక ప్రజలను ఆకట్టుకొని వారి ఓట్లు సంపాదించుకొనేందుకేనా లేక ఎన్నికల తరువాత నిజంగానే రాహుల్ గాంధీతో ప్రధానమంత్రి పదవి కోసం దేవగౌడ పోటీ పడతారా? అనే విషయం తెలియాలి. ప్రధానమంత్రి అభ్యర్ధి గురించి ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఆలోచిస్తామని కాంగ్రెస్‌ మిత్రపక్షాలు చెపుతున్నందున ప్రస్తుతానికి రెండుపార్టీలు సీట్లు సర్దుబాట్లు చేసుకొని ముందుకు సాగబోతున్నాయి.


Related Post