జాతిభద్రతపై రాజకీయాలేల?

March 06, 2019


img

పుల్వమా ఘటన తరువాత ప్రతిపక్ష పార్టీలన్నీ కేంద్రప్రభుత్వానికి సంఘీభావం ప్రకటించాయి. కానీ అది మూన్నాళ్ళ ముచ్చటే అయ్యింది. నాలుగు రోజులు గడిచ్చేసరికి పుల్వామా తదనంతర పరిణామాలపై దేశంలో నీచ రాజకీయాలు మొదలైపోయాయి. 

ప్రధాని నరేంద్రమోడీ దేశభద్రతను పణంగాపెట్టి లోక్‌సభ ఎన్నికలలో రాజకీయ మైలేజ్ పొందడం కోసమే ఇంత హడావుడి చేశారని రాహుల్ గాంధీ విమర్శిస్తున్నారు. 

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బిజెపి నేత ఎడ్యూరప్ప మాట్లాడిన మాటలు రాహుల్ గాంధీ ఆరోపణలను  దృవీకరిస్తున్నట్లుగా ఉన్నాయి. “వాయుసేన దాడుల తరువాత కర్ణాటకలో మా పార్టీ విజయావకాశాలు బాగా పెరిగాయి. లోక్‌సభ ఎన్నికలలో మాపార్టీ 22 సీట్లు గెలుచుకోబోతోంది,” అని అన్నారు.     

పంజాబ్ కాంగ్రెస్‌ ప్రభుత్వంలో మంత్రిగా చేస్తున్న నవజ్యోత్ సింగ్ సిద్దూ “భారత్‌ వాయుసేన బాలాకోట్ లో ఉగ్రవాదులను మట్టుబెట్టిందా లేక చెట్లు కూల్చి వచ్చిందా? అయితే ఎన్ని చెట్లు కూల్చిందో లెక్క చెప్పాలని” ఎద్దేవా చేశారు. 

సీనియర్ కాంగ్రెస్‌ నేత దిగ్విజయ్ సింగ్ మరో అడుగు ముందుకు వేసి, “పుల్వామా దాడిపై మాకు అనుమానాలున్నాయి. అది నిజంగా ఉగ్రవాద దాడేనా లేక ఏదైనా రోడ్డు ప్రమాదమా? పుల్వామా దాడి, బాలకోట్ పై భారత్‌ ఎదురుదాడిపై అంతర్జాతీయ మీడియా పలు సందేహాలను లేవనెత్తుతోంది. వాటికి మోడీ ప్రభుత్వం సంతృప్తికరమైన సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది,” అని అన్నారు. 

జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ మాట్లాడుతూ, “లోక్‌సభ ఎన్నికలకు ముందు పాకిస్థాన్‌తో యుద్ధం చేస్తామని రెండేళ్ల క్రితమే ప్రధాని నరేంద్రమోడీ నాతో అన్నారు,” అని చెప్పారు. 

లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ యుద్ధ పరిణామాలు జరిగినందున రాజకీయ నేతలు ఈవిధంగా మాట్లాడుతున్నారని సర్ధి చెప్పుకొన్నప్పటికీ, వారు మాట్లాడుతున్న ఇటువంటి మాటలన్నీ పాక్‌ పాలకులకు భారత్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టేందుకు, భారత్‌ విషయంలో వారు చేస్తున్న వితండవాదాన్ని సమర్ధించుకొనేందుకు బాగా ఉపయోగపడుతోందనే విషయం మన రాజకీయ నేతలు విస్మరిస్తున్నారు. 

సార్వత్రిక ఎన్నికలలో గెలిచేందుకు రాజకీయ పార్టీలు ఎన్ని రాజకీయాలు చేసుకొన్నా అభ్యంతరం ఉండదు కానీ అందుకోసం దేశాన్ని అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టాలనుకోవడం ప్రజలెవరూ ఆమోదించలేరు. పుల్వామా ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు బలైపోతే ‘అక్కడ జరిగింది రోడ్డు ప్రమాదేమేమో?’ అని దిగ్విజయ్ సింగ్ అనుమానం వ్యక్తం చేయడం నీచరాజకీయమేనని చెప్పక తప్పదు. ఇటువంటి నీచరాజకీయాలను చేసేవారికి రానున్న ఎన్నికలలో ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది.


Related Post