పాక్‌లో 42 మంది ఉగ్రవాదుల అరెస్ట్... నమ్మవచ్చా?

March 09, 2019


img

అంతర్జాతీయ ఒత్తిళ్ళ కారణంగా పాక్‌ ప్రభుత్వం ఆదేశాల మేరకు పాక్‌ పోలీసులు నిన్న ఒకేసారి 42 మంది ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు. వారిలో జైష్-ఏ-మహమ్మద్ ఉగ్రవాద సంస్థ అధినేత మసూద్ అజర్‌ కుమారుడు హమ్మద్ అజార్, సోదరుడు ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ కూడా ఉన్నారు. మసూద్ అజర్‌ తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స చేయించుకొంటున్నందున అతనిని అరెస్ట్ చేయలేదు. పుల్వామా దాడిలో హమ్మద్ అజార్, ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ ల హస్తం ఉందని భారత్‌ ఆరోపిస్తున్నందున వారిరువురినీ అరెస్ట్ చేశామని రక్షణశాఖ సహాయమంత్రి షేర్‌యార్‌ అఫ్రీది తెలిపారు. ప్రభుత్వం గుర్తించిన తీవ్రవాదుల ఆస్తులను జప్తు చేసి వారి బ్యాంక్ ఖాతాలను స్తంభింపజేస్తామని చెప్పారు. ముంబై దాడులకు(26/11) సూత్రధారి మసూద్ అజర్‌ స్థాపించిన జమాతుద్‌ ఉగ్రవాద సంస్థ, దాని అనుబంధ సంస్థ ఫలాహ్‌-ఎ-ఇన్సానియత్‌ ఫౌండేషన్‌లను నిషేదిస్తూ పాక్‌ హోంశాఖ మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. 

పాకిస్తాన్ ఉగ్రవాదులకు నిలయంగా మారిందని చెప్పడానికి ఈ తాజా అరెస్టులు, నిషేధాజ్ఞలే మంచి నిదర్శనం. కానీ కాశ్మీర్ సమస్య కారణంగా భారత్‌-పాక్‌ మద్య తరచూ ఇటువంటి ఉద్రిక్త పరిస్థితులు పునరావృతం అవుతున్నాయని పాక్‌ పాలకులు వితండవాదం చేస్తుండటం గమనిస్తే, ఇప్పుడు కొంతమంది ఉగ్రవాదులను అరెస్ట్ చేసినప్పటికీ వారి వైఖరిలో ఎటువంటి మార్పు రాబోదని స్పష్టం అవుతోంది. అంతర్జాతీయ ఒత్తిళ్ళు తగ్గుముఖం పట్టగానే మళ్ళీ ఉగ్రవాదులను విడిచిపెట్టి మళ్ళీ వారిని భారత్‌పైకి ప్రేరేపించక మానదు. కనుక భారత్‌-పాక్‌ సంబంధాలు ఎప్పటికీ ఈవిధంగానే ఉండవచ్చు.


Related Post