అన్నాడిఎంకెతో దోస్తీ బిజెపిని గట్టెక్కిస్తుందా?

March 06, 2019


img

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు ప్రధాని నరేంద్రమోడీ చెన్నై శివార్లలోని వండలూరు సమీపంలోని  కిళంబాక్కంలో బిజెపి అధ్వర్యంలో జరుగబోయే బహిరంగసభలో పాల్గొనబోతున్నారు. ఈరోజు ఉదయం కర్ణాటకలో పర్యటించి బహిరంగసభలో పాల్గొంటారు. అక్కడి నుంచి ప్రత్యేకవిమానంలో మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై చేరుకొని, విమానాశ్రయం నుంచి హెలికాఫ్టరులో వేదికవద్దకు చేరుకొంటారు. సభ ముగిసిన తరువాత మళ్ళీ చెన్నై విమానాశ్రయం నుంచి డిల్లీ తిరిగివెళతారు. భారత్‌-పాక్‌ ఉద్రిక్తతలు తగ్గినప్పటికీ, ప్రధాని మోడీ పర్యటన సందర్భంగా కిళంబాక్కంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీగా భద్రతాఏర్పాట్లు చేశారు. 

తమిళనాడులో ప్రాంతీయపార్టీలకే తప్ప కాంగ్రెస్‌, బిజెపి వంటి జాతీయపార్టీలను ప్రజలు పట్టించుకోరు. కనుక ప్రధాని నరేంద్రమోడీ, సోనియా, రాహుల్ గాంధీ స్వయంగా వచ్చి ఎన్నికల ప్రచారం చేసినా ఆ పార్టీలు సొంతంగా గెలవలేని పరిస్థితి. అందుకే లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష డిఎంకెతో, బిజెపి అధికార అన్నాడిఎంకె పార్టీలతో ఎన్నికల పొత్తులు పెట్టుకొన్నాయి. జయలలిత ఆకస్మిక మరణం తరువాత అన్నాడిఎంకె పార్టీని కేంద్రం తన గుప్పెట్లోకి తెచ్చుకోగలిగింది కానీ లోక్‌సభ ఎన్నికలలో తమిళనాడు ప్రజలను కూడా ఆకట్టుకొని పొత్తులలో భాగంగా బిజెపికి కేటాయించబడిన 6 లోక్‌సభ స్థానాలలో 3-4 స్థానాలనైనా గెలుచుకోగలిగితే తమిళనాడులో బిజెపి అడుగుపెట్టినట్లే భావించవచ్చు.


Related Post