అమిత్ షా, రాహుల్ రాష్ట్ర పర్యటనలతో ఫలితం ఉంటుందా?

March 05, 2019


img

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల సన్నాహాలలో భాగంగా జాతీయస్థాయి నాయకుల రాష్ట్ర పర్యటనలు మోదలవుతున్నాయి. బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా బుదవారం నిజామాబాద్‌లో పర్యటించనున్నారు. నిజామాబాద్‌, అదిలాబాద్, కరీంనగర్‌, జహీరాబాద్, మెదక్ లోక్‌సభ నియోజకవర్గాలకు చెందిన నేతలతో రేపు సమావేశం అవుతారని బిజెపి ఎంపీ బండారు దత్తాత్రేయ చెప్పారు. లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొని విజయం సాధించడానికి ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తారని చెప్పారు. తెరాస 16 లోక్‌సభ స్థానాలను గెలుచుకోబోతోందని చెప్పుకోవడం ఆ పార్టీ నేతల అహంకారానికి పరాకాష్ట అని అన్నారు. తెరాస 6 స్థానాలు గెలుచుకొంటే చాలా గొప్ప విషయమేనాని ఎద్దేవా చేశారు. తమ పార్టీ 17 లోక్‌సభ స్థానాలకు పోటీ చేస్తుందని బండారు దత్తాత్రేయ చెప్పారు. 

కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఈనెల 9న రాష్ట్ర పర్యటనకు రాబోతున్నారు. ఆయన పర్యటన ఖరారు కావడంతో తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు ఈరోజు అత్యవసరంగా గాంధీభవన్‌లో సమావేశమయ్యి ఎక్కడ బహిరంగసభ నిర్వహించాలనే అంశంపై చర్చించి చివరికి మహేశ్వరం సమీపంలోగల పహాడీ షరీఫ్ వద్ద నిర్వహించాలని నిర్ణయించారు. 

రాష్ట్రంలో గల 17 ఎంపీ సీట్లలో తెరాస 16 సీట్లు గెలుచుకోబోతోందని సిఎం కేసీఆర్‌ నమ్మకంగా చెపుతున్నారు. ఆయన జోస్యం ఎప్పుడూ తప్పలేదు. కనుక ఈ నేపధ్యంలో కాంగ్రెస్‌, బిజెపి అధినేతల పర్యటనలతో రాష్ట్రంలో ఏమేరకు ప్రభావం చూపగలరో చూడాలి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాలలో పోటీ చేసి కేవలం ఒకే ఒక సీటు గెలుచుకొని ఘోరంగా ఓటమి పాలైన బిజెపికి లోక్‌సభ ఎన్నికలు అగ్నిపరీక్షవంటివేనాని చెప్పవచ్చు. ఈ ఎన్నికలలో కూడా కాంగ్రెస్‌, తెరాసలే అన్ని సీట్లు గెలుచుకొన్నట్లయితే రాష్ట్రంలో బిజెపి పరిస్థితి మరింత దయనీయంగా మారవచ్చు. 


Related Post