ఉత్తమ్ నేతృత్వంలో కష్టమే: కాంగ్రెస్‌ ఎమ్మెల్యే

March 05, 2019


img

నిన్న మొన్నటి వరకు ఆత్రం సక్కు అంటే కాంగ్రెస్ పార్టీలోనే చాలా మందికి తెలియదు కానీ ఇప్పుడు ఆయన పేరు రాష్ట్రంలో మారుమోగిపోతోంది. ఆయన హటాత్తుగా కాంగ్రెస్ పార్టీకి హ్యాండ్ ఇచ్చేసి తెరాసలో చేరిపోతుండటమే అందుకు కారణం. ఆ పనేదో నిశబ్ధంగా చేసి ఉండి ఉంటే కాంగ్రెస్‌ నేతలు కూడా ఆయనను పెద్దగా పట్టించుకొనేవారు కారేమో కానీ బయటకుపోతూ రాష్ట్ర కాంగ్రెస్‌, పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డిపైన తీవ్ర విమర్శలు చేస్తుండటంతో మీడియా దృష్టిలో పడ్డారు. 

తాను తెరాసకు అమ్ముడుపోయానని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ఆరోపణలపై స్పందిస్తూ, “కాంగ్రెస్‌ నేతలు మాపై అటువంటి నీచమైన ఆరోపణలు చేయడం సిగ్గుచేటు. అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు తిరస్కరించారనే సంగతి మరిచిపోయి విర్రవీగుతున్నారు. రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పార్టీ ఎంతోకాలం మనుగడ సాగించలేదు. ముఖ్యంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఎన్నటికీ అధికారంలోకి రాలేదని నేను చెప్పగలను. కాంగ్రెస్‌ హయాంలో ఆదివాసీలకు చేసిందేమీ లేదు. కానీ గత నాలుగున్నరేళ్ళలో సిఎం కేసీఆర్‌ ఆదివాసీల సంక్షేమం కోసం చాలా చేశారు. ఆదివాసీల సమస్యలను పరిష్కరించేందుకే నేను తెరాసలో చేరుతున్నాను తప్ప వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదు. అవసరమైతే నా పదవికి రాజీనామా చేసి తెరాసలో చేరుతాను,” అని ఆత్రం సక్కు అన్నారు.


Related Post