ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ ఓటమి ఖరారు

March 04, 2019


img

ఎమ్మెల్యేల కోటాలో జరుగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధిగా టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. కానీ ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఒక టిడిపి ఎమ్మెల్యే త్వరలో తెరాసలో చేరిపోబోతున్నట్లు ప్రకటించినందున ఎన్నికలకు ముందే ఆయన ఓటమి ఖరారైపోయింది. 

నామినేటడ్ ఎమ్మెల్యే (స్టీఫెన్ సన్‌)తో కలిపి రాష్ట్ర శాసనసభలో మొత్తం 120 మంది ఎమ్మెల్యేలున్నారు. ఎమ్మెల్యేల కోటాలో ఖా అవుతున్న 5 ఎమ్మెల్సీ స్థానాలలో తెరాస (4) మజ్లీస్ (1), కాంగ్రెస్‌ (1) కలిపి మొత్తం ఆరుగురు అభ్యర్ధులు బరిలో ఉన్నారు. కనుక ఒక్కో అభ్యర్ధికి (120/6) 20 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం ఉంటుంది. 19 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలలో ఇద్దరు చేజారిపోయారు. మిత్రపక్షం టిడిపికి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు  లభిస్తుందనుకొంటే, వారిలో ఒక ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కూడా తెరాసలో చేరిపోతున్నట్లు ఈరోజే ప్రకటించారు. కనుక టిడిపిలో మిగిలిన ఒక ఎమ్మెల్యేను కూడా కలుపుకొంటే కాంగ్రెస్‌ వద్ద మొత్తం 18 మంది మాత్రమే ఉన్నారు. కనుక కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ అభ్యర్ధి గూడూరు నారాయణరెడ్డి ఓటమి ఖరారైపోయినట్లే. 

ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి ముగ్గురు ఎమ్మెల్సీలున్నారు. వారు ఈ నెలాఖరుకు పదవీ విరమణ చేయనున్నారు. కనుక ఎమ్మెల్యేల కోటలో ఒకరిని, పట్టభద్రులకోటాలో జీవన్ రెడ్డిని బరిలోకి దింపి కనీసం రెండు సీట్లు దక్కించుకోవాలనుకొంది. కానీ ఒక సీటు అప్పుడే చేజారిపోయింది. పట్టభద్రులకోటాలో జీవన్‌ రెడ్డి గెలవలేకపోతే శాసనమండలిలో కాంగ్రెస్ పార్టీకి ప్రాతినిధ్యం లేకుండాపోతుంది. ఎమ్మెల్సీ స్థానాలతో పాటు శాసనసభ్యులను కూడా కోల్పోవడం కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టమేనని చెప్పవచ్చు.


Related Post