భారత్‌-పాక్‌ మద్య అసక్తికర పరిణామాలు

March 04, 2019


img

ప్రపంచ దేశాల ఒత్తిడితో వింగ్ కమాండర్ అభినందన్‌ వర్ధమాన్‌ను భారత్‌కు అప్పగించి పాక్‌ వెనక్కు తగ్గడంతో భారత్‌-పాక్‌ మద్య ఏర్పడిన యుద్ధమేఘాలు తొలగిపోయాయి. అయితే ఈ సందర్భంగా కొన్ని ఆసక్తికర పరిణామాలు జరిగాయి. 

1. పాక్‌ భూభాగంలోని బాలాకోట్ లోని ఉగ్రవాద స్థావరాలపై దాడికి ముందు భారత్‌ వాయుసేన ఒక అద్భుతమైన వ్యూహం అమలుచేసింది. దాడికి ముందు పంజాబ్ సరిహద్దుల వెంబడి భారత్‌ వాయుసేన విమానాలతో హడావుడి చేయించడం ద్వారా బాలాకోట్ వైపు గస్తీ కాస్తున్న పాక్‌ యుద్ధవిమానాలను అటువైపు పరుగులు పెట్టించింది. అదే అదునుగా గ్వాలియర్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరిన మీరాజ్ యుద్ధవిమానాలు క్షణాలలో బాలాకోట్ వైపు దూసుకుపోయి శత్రుశిబిరాలను ద్వంసం చేసి సురక్షితంగా వెనక్కు తిరిగివచ్చేశాయి. దీనిని ‘డెకాయ్ ఆపరేషన్’గా భారత్‌ వాయుసేన పేర్కొంటోంది. 

2. భారత్‌పై ప్రతీకారం తీర్చుకొనేందుకు పాక్‌ ఎఫ్-16 విమానాలను ఉపయోగించి పెద్ద తప్పు చేసింది. అమెరికా ఆగ్రహానికి అదీ ఒక కారణమయ్యింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, శత్రువులను క్షణాలలో నాశనం చేయగల అతి శక్తివంతమైన ఆ విమానాలను కేవలం పాక్‌లోని ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకే వినియోగిస్తానని పాక్‌ హామీ ఇచ్చింది. కానీ ఆ హామీని ఉల్లంఘించి భారత్‌పై దాడికి వినియోగించింది. అందుకే ఎఫ్-16 ఉపయోగించలేదని, దానిని ఎవరూ కూల్చలేదని బుకాయించింది. కానీ దాని శిధిలాలను భారత్‌ వాయుసేన అధికారులు మీడియాకు ప్రదర్శించడంతో పాక్‌ దొంగాట బట్టబయలు అయ్యింది. 

3. అమెరికా ఆగ్రహానికి అదొక కారణమైతే, ఎఫ్-16 విమానానికి ఏమాత్రం సరితూగని మిగ్-21 బైసన్  యుద్దవిమానంతో వింగ్ కమాండర్ అభినందన్‌ వర్ధమాన్‌ దానిని కూల్చివేయడం అమెరికాకు తలవంపుగా మారింది.

4. అమెరికాకు తలవంపుగా మారినదే భారత్‌కు ఒక గొప్ప రికార్డుగా నిలుస్తోంది. అత్యాధునిక, శక్తివంతమైన ఎఫ్-16 విమానాన్ని మిగ్-21 బైసన్ యుద్దవిమానంతో కూల్చిన ఘనత అభినందన్‌ వర్ధమాన్‌కే దక్కుతుందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌ కృష్ణస్వామి అయ్యర్‌ తెలిపారు. 

5. వాయుసేన దాడిలో 250-300 మంది ఉగ్రవాదులు మరణించి ఉండవచ్చని భారత్‌ చెపుతుంటే, అక్కడ చెట్లు, గుట్టలు తప్ప మరేమీ లేవని, ఆ దాడిలో అనేక చెట్లుకూలిపోయాయని, తద్వారా పర్యావరణానికి తీవ్ర నష్టం కలిగిందంటూ ఐక్యరాజ్యసమితికి ఫిర్యాదు చేస్తామని పాక్‌ వాదిస్తోంది. కానీ బాలాకోట్ లో ఉగ్రవాదుల శిబిరాలుండే నిర్ధిష్ట ప్రదేశాల పూర్తి వివరాలను, ఉపగ్రహ ఛాయాచిత్రాలను అన్నిటినీ అత్యాధునిక లేజర్ గైడెడ్ మిసైల్స్ కు అనుసంధానం చేసిన కంప్యూటర్లో నిక్షిప్తం చేసినందున, అవి తమ లక్ష్యాలను ఖచ్చితంగా చేధించాయని వాయుసేన స్పష్టం చేసింది. 

6. ఆ లక్ష్యాలపై ఖచ్చితంగా దాడి నిర్వహించడం వరకే తమ బాధ్యత అని ,తమ దాడిలో ఎంతమంది చనిపోయారో లెక్కించవలసిన బాధ్యత తమది కాదని భారత వాయుసేన ఐఏఎఫ్‌ చీఫ్‌ బీఎస్‌ ధనోవా  కొద్దిసేపటి క్రితం తెలిపారు. 

7. అభినందన్‌ వర్ధమాన్‌కు వైద్యులు ఫిట్ నెస్ సర్టిఫికేట్ ఇచ్చిన మరుసటి రోజు నుంచే మళ్ళీ కాక్ పిట్ లో కూర్చోంటారని బీఎస్‌ ధనోవా తెలిపారు.

8. భారత్‌-పాక్‌ సరిహద్దుల వద్ద గత నాలుగురోజులుగా ఏకధాటిగా సాగిన కాల్పులు నిలిచిపోవడంతో, సరిహద్దు గ్రామాలలో నివశిస్తున్న ప్రజలు మళ్ళీ తమ ఇళ్లకు చేరుకొంటున్నారు. నేటి నుంచి సరిహద్దు గ్రామాలలో పాఠశాలలు తిరిగి తెరుచుకొన్నాయి.


Related Post