మా ఎంపీ, ఎమ్మెల్సీలను ఎంతకూ కొన్నారు?కేటీఆర్‌

March 04, 2019


img

ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను తెరాసలోకి ఆకర్షించడంపై పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన విమర్శలను తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ తిప్పికొట్టారు.

“మొదట ఫిరాయింపులను ప్రారంభించింది...వాటిని ప్రోత్సహించింది మీ పార్టీయే. టిడిపి ఎమ్మెల్యే రేవంత్‌ రెడ్డిని, మా ఎంపీ కొండా విశ్వశ్వర్ రెడ్డిని, మా ఎమ్మెల్సీలు భూపతిరెడ్డి, యాదవ్ రెడ్డిలను మీపార్టీలోకి ఫిరాయింపజేసుకోలేదా? అలాగే మీ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో నిన్న యూపీలో బిజెపి ఎంపీ సావిత్రీబాయి పూలేను మీ పార్టీలో చేర్చుకోలేదా? వారందరికీ కాంగ్రెస్ పార్టీ ఎంతడబ్బు చెల్లించి కొనుగోలు చేసిందో ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పాలి. ఏపీలో చంద్రబాబునాయుడు 22 మంది వైకాపా ఎమ్మెల్యేలను టిడిపిలోకి ఫిరాయింపజేసినప్పుడు మీరేందుకు నోరెత్తలేదు? పైగా అసెంబ్లీ ఎన్నికలలో ఆయనతోనే పొత్తులు కూడా పెట్టుకొన్నారు కదా? గిరిజనుల సంక్షేమం కోసం సిఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృద్ధి పనులను చూసి ఆకర్షితులైన సత్రం అక్కు, రేగా కాంతారావు మా పార్టీలో చేరుతున్నారే తప్ప వారిని మేము ప్రలోభపెట్టలేదు. మా నాయకత్వంలో బలం ఉందని మీ పార్టీనేతలు కూడా అంగీకరిస్తున్నారు కానీ మీ నాయకత్వం బలహీనంగా ఉందని, పిసిసి అధ్యక్షుడుని తక్షణం మార్చాల్సిన అవసరం ఉందని మీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిన్ననే కదా చెప్పారు?” అని ఘాటుగా సమాధానం చెప్పారు. 

కేటీఆర్‌ సమాధానం చాలా ఘాటుగా చక్కగా ఉన్నమాట వాస్తవం. కానీ ప్రత్యర్ది పార్టీలు తప్పు చేస్తున్నాయి కనుక మేము అదే తప్పు చేస్థామ్. ఆవిధంగా తప్పు చేయడం తప్పు కాదన్నట్లు కేటీఆర్‌ సమర్ధించుకోవడం సరికాదు. అధికారంలో ఉన్నవారు ప్రజలకు, ప్రతిపక్షాలకు ఆదర్శంగా నిలవాలి తప్ప ఇటువంటి వాదనలతో తమ తప్పులను సమర్ధించుకోవాలనుకోవడం సరికాదు. 

తాత్కాలిక ప్రయోజనాల కొరకు లేదా ప్రతిపక్షాలను బలహీనపరచి వాటిపై పైచేయి సాధించడం కోసం ఇటువంటి అనైతిక, అప్రజాస్వామిక ధోరణులను ప్రోత్సహించినట్లయితే ఏ పార్టీకైనా అదే నష్టం, అదే నొప్పి భరించకతప్పదని తెరాస ఎంపీ, ఎమ్మెల్సీల ఫిరాయింపులు నిరూపించాయి. కనుక రాజకీయాలలో ఉన్నవారు వీలైనంతవరకు ప్రజాస్వామ్య విధానాలను, ముఖ్యంగా నైతిక విలువలను పాటించడం చాలా అవసరం లేకుంటే ఏదో ఓ రోజు మళ్ళీ వారే నష్టపోతారని గ్రహిస్తే మంచిది.


Related Post