ఫిరాయింపులపై కేసీఆర్‌ వైఖరిలో మార్పు?

March 04, 2019


img

2014 అసెంబ్లీ ఎన్నికల తరువాత రాష్ట్రంలో కాంగ్రెస్‌, టిడిపి, వైసీపీల ఎమ్మెల్యేలు, ఎంపీలు తెరాసలోకి ఫిరాయించారు. వారిలో ఏ ఒక్కరూ తమ ఎమ్మెల్యే పదవులకు చివరి వరకు రాజీనామా చేయలేదు. 2018 ముందస్తు ఎన్నికలలో కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి ఘోరపరాజయం పాలవడంతో రాష్ట్రంలో మళ్ళీ ఫిరాయింపులు మొదలయ్యాయి. కాంగ్రెస్‌ నుంచి రేగా కాంతారావు, ఆత్రం సక్కు, టిడిపి నుంచి సండ్ర వెంకటవీరయ్యలతో కలిపి ముగ్గురు ఎమ్మెల్యేలు తెరాసలోకి ఫిరాయించబోతున్నారు. ఫిరాయింపులను ప్రోత్సహించడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ ఆందోళనలకు సిద్దం అవుతోంది. కానీ గత అనుభవాలను బట్టి చూసినట్లయితే ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు వరకు వెళ్ళి పోరాడినా ఫలితం ఉండబోదని రుజువైంది. కనుక ఇప్పుడూ అదే జరుగవచ్చు. 

తెరాసకు శాసనసభలో పూర్తిబలం ఉన్నప్పటికీ ఫిరాయింపులను ఎందుకు ప్రోత్సహిస్తోంది? ప్రతిపక్ష పార్టీల ఎమ్మెల్యేలు తెరాసలోకి ఎందుకు చేరిపోవాలనుకొంటున్నారు?స్పీకర్, న్యాయస్థానాలు ఫిరాయింపులను ఎందుకు అడ్డుకోవడం లేదు?అనే ప్రశ్నలకు జవాబులు అందరికీ తెలుసు కనుక వాటి గురించి మళ్ళీ చెప్పుకోనవసరంలేదు. 

అయితే ఈసారి ఫిరాయించబోతున్న ముగ్గురు ఎమ్మెల్యేల నోట ఒక ఆసక్తికరమైన మాట వినిపిస్తోంది. అవసరమైతే తమ పదవులకు రాజీనామాలు చేసి తెరాసలో చేరి మళ్ళీ ఉపఎన్నికలలో పోటీ చేస్తామని వారు చెప్పడం గమనిస్తే, సిఎం కేసీఆర్‌ సూచన మేరకే ఆవిధంగా చెపుతుండవచ్చుననుకోవచ్చు. 

ఈ ఫిరాయింపులకు “బంగారి తెలంగాణ సాధన కోసం రాజకీయ పునరేకీకరణ”అనే అందమైన ముసుగు తొడిగినప్పటికీ  అవి రాజకీయ అవసరాలు, కారణాలతో జరుగుతున్నాయనే సంగతి సామాన్య ప్రజలకు సైతం తెలుసు. ఫిరాయింపులకు సాకు ఏదైతేనేమీ వాటిని ప్రోత్సహిస్తునందుకు ఆయా పార్టీల నుంచి తీవ్ర విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవలసిరావడం, ఆ తప్పును సమర్ధించుకొంటూ ప్రభుత్వం న్యాయస్థానాలలో పోరాడవలసిరావడం, ఈ అనైతిక, అప్రజాస్వామ్య వ్యవహారాల గురించి మీడియాలో వచ్చే కధనాలతో పార్టీ ప్రతిష్టకు భంగం కలుగుతుండటం వంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇకపై తెరాసలో చేర్చుకొనే ఇతర పార్టీల ఎమ్మెల్యేల చేత రాజీనామాలు చేయించి, మళ్ళీ తెరాస తరపున ఉప ఎన్నికలలో పోటీ చేయించి గెలిపించుకోవడం ద్వారా ఈ విమర్శలు, సమస్యలన్నిటికీ చెక్ పెట్టవచ్చునని సిఎం కేసీఆర్‌ భావిస్తున్నారేమో?

అసెంబ్లీ ఎన్నికలలో 119 స్థానాలలో మెజారిటీ అభ్యర్ధులను గెలిపించుకోవడానికి చాలా కష్టపడవలసి రావచ్చు కానీ పూర్తి మెజార్టీతో అధికారంలోకి వచ్చిన తరువాత ఉపఎన్నికలలో ఒకరిద్దరిని గెలిపించుకోవడం పెద్దకష్టమేమీ కాదు. పైగా ఉపఎన్నికలలో కూడా ప్రతిపక్షాలను మరోసారి ఓడించగలిగితే వాటి మనోస్థైర్యం మరింత దెబ్బతింటుంది. బహుశః అందుకే తెరాసలో చేరబోతున్న ముగ్గురు ఎమ్మెల్యేలు “అవసరమైతే పదవులకు రాజీనామాలు చేసి మళ్ళీ పోటీ చేయడానికి సిద్దం” అని చెపుతున్నారనుకోవచ్చు.

ఒకవేళ సిఎం కేసీఆర్‌ ఈ పద్దతిని అనుసరిస్తే అప్పుడు ప్రతిపక్షాలు కూడా ఆయనను వేలెత్తి చూపలేవు. పైగా వాటిలో మిగిలిన నేతలకీ తమ అదృష్టాన్ని పరీక్షించుకొనేందుకు మరో అవకాశం లభిస్తుంది కనుక ప్రతిపక్షాలు కూడా స్వాగతించవచ్చు.


Related Post